స్వయంవరం

Swayamvaramమధురానగర మహారాజు చంద్రభూపాలునికి ఒక్కగానొక్క కుమార్తె చంద్రకళ. ఆమె గుణవంతురాలు. అందగత్తె కూడాను. పెళ్లీడుకు వచ్చిన ఆమెకు స్వయంవరం ప్రకటించారు. ఆమె అందచందాలు విని అనేకమంది స్వయంవరానికి విచ్చేసారు. స్వయంవరం రోజున అనేక పోటీలు నిర్వహిస్తే, ముగ్గురు విజయం సాధించారు. వారు కళింగ యువరాజు అనిల్‌ సింహుడు, ఉజ్జయిని యువరాజు విక్రమ్‌ ఖన్నా, ఉజ్జయిని మంత్రి కుమారుడు సాగరుడు. వీరిలో ఎవరిని చంద్రకళ వరిస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మహారాజు, చంద్రకళతో ”చంద్రా! ఉజ్జయిని యువరాజు విక్రమ్‌ ఖన్నా బహు అందగాడు, పరాక్రమవంతుడు, తెలివి గలవాడు. కళింగ యువరాజు అనిల్‌ సింహుడు సాహసం, సౌందర్యం సమపాళ్లలో కలిగినవాడు. అలాగే సంగీత శాస్త్ర ప్రవీణుడు. ఇక సాగరుడి విషయానికొస్తే, అతను కూడా పరాక్రమవంతుడే. అలాగే వినయశీలి, తెలివి గలవాడు, బహుశాస్త్రాలను పఠించాడు. ఇలా ముగ్గురూ ఎవరికివారే అసాధ్యులు. వీరిలో ఎవరిని వరిస్తావు” అని అడిగాడు.
అప్పుడు చంద్రకళ ”నాన్నా! ముగ్గురూ సమఉజ్జీలుగా ఉన్నారు కాబట్టి, నాకో ఆలోచన వచ్చింది!” అంటూ ఏదో చెప్పింది. దీనికి మహారాజు వెంటనే తల ఊపాడు.
తర్వాత రోజు సభలో మహారాజు ద్ణుఖ స్వరంతో ఆ ముగ్గురితో ఇలా అన్నాడు ”మా దురదష్టం కొద్దీ నిన్న రాజకుమారి కండ్లను గుడ్లగూబ పొడిచివేసింది. కండ్లు కనపడకపోవడంతో వేడినీళ్లలో పడిపోయింది. మీలో ఎవరు వివాహం చేసుకుంటారో నిర్ణయించుకోండి.”
వెంటనే కళింగ యువరాజు ”ఉహ్.. గుడ్డిదాన్ని, అందవిహీనురాలిని ఎవరు పెండ్లి చేసుకుంటారు?” అని తన సైనికులతో కలిసి అక్కడ్నుంచీ నిష్క్రమించాడు.
ఉజ్జయిని యువరాజు కూడా అలాగే వెళ్లిపోయాడు. కానీ సాగరుడు మాత్రం ”మహారాజా.. యువరాణిని నేను పెండ్లి చేసుకుంటాను” అని చెప్పాడు.
దానికి మహారాజు ఆశ్చర్యపోతూ ”అంధురాల్ని, అంద విహీనురాలిని ఎలా పెండ్లి చేసుకుంటావు?” అనడిగాడు. దానికి సాగరుడు జవాబిస్తూ ”నాకు ఆమె అందచందాల కన్నా గుణగణాలు, ఔదార్యం ఆకట్టుకున్నాయి. నేను రెండు రోజుల క్రితం దేవాలయానికి వెళ్లాను. అనుకోకుండా రాకుమారి కూడా తన చెలికత్తెలతో కలిసి అక్కడకు వచ్చారు. దూరం నుంచే ఆమెను నేను గమనిస్తున్నాను. ఒక వద్ధుడు పొరపాటున పక్కన ఉన్న మురికిగుంటలోకి జారి పడిపోయాడు. ఆ మురికి, రాకుమారి దుస్తులపై చిమ్మింది. చెలికత్తెలు అతన్ని దూషించసాగారు. కానీ యువరాణి వారిని కోప్పడి, ఆ వద్ధునికి చేయందించింది. పక్కన ఉన్న మంచినీటితో అతన్ని శుభ్రపర్చడానికి ప్రయత్నించింది. అంతేకాకుండా కొత్తబట్టలు కొనుక్కోమని కొంత నగదు కూడా ఇచ్చింది. అతను ఆమెను ఆశీర్వదించి వెళ్లిపోయాడు. పెద్దల పట్ల యువరాణికి ఉన్న గౌరవం నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసింది. అందుకే యువరాణిని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని మనస్ఫూర్తిగా చెప్పాడు.
సభ మొత్తం కరతాళధ్వనులతో నిండిపోయింది. మహారాజు ఆనందంగా ”సాగరా… మా పరీక్షలో నువ్వే గెలిచావు. చంద్రకళ అంధురాలు కాదు, అందవిహీనురాలు అంతకన్నా కాదు” అంటూ రాకుమారిని పిలిచాడు. మిరుమిట్లు గొలిపే అందంతో చంద్రకళ అక్కడకు వచ్చింది. ఆమెనలా చూడగానే సాగరుడు కూడా చాలా ఆనందపడ్డాడు.
వారిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తర్వాత చంద్రభూపాలుడు అల్లుడికి తన రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేసుకోడానికి అడవులకి వెళ్లిపోయాడు.
– లాలిత్య పులగం