– త్వరలో షెడ్యూల్ విడుదల
– కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజలకు చూపిస్తాం
– బీఆర్‌ఎస్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
60 ఏండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చూపించేందుకు ‘సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్‌మెంట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రచార కమిటీ చైర్మెన్ మధు యాష్కీగౌడ్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు సంబంధించిన ఫోటో అల్బమ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ పథకంపై తొలి సంతకం చేసిన ఫోటోతో విక్రమార్క ‘సెల్ఫీ విత్ ఫ్రీ పవర్ సిగేచర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ అని పునరుద్ఘాటించారు. ఉచిత కరెంటు తమ పాలసీ అంటూ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ప్రతి సందర్బంలో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తద్వారా తెలంగాణ సమాజన్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలు, ఆగడాలను అరికట్టేందుకు కాంగ్రెస్ పార్టీగా 60 ఏండ్లుగా తెలంగాణలో ఏం అభివృద్ధి చేశామో… తెలంగాణ ప్రజలకు చెప్పేందుకు సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనుల ముందు సెల్ఫీ దిగి తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. ఉచిత విద్యుత్తు బీఆర్‌ఎస్సే తెచ్చిందంటూ అంతకు ముందు లేదన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌లా తాము మాయమాటలు, అభూతకల్పనలు చేయడం లేదన్నారు. వైఎస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచిత కరెంటు పథకంపై సంతకం చేశారని గుర్తు చేశారు. అది చారిత్రాత్మకమైన రోజని తెలిపారు. ఉచిత కరెంటు ఫైల్ పై సంతకం చేసిన ఫోటోను మీడియా సమావేశంలో విడుదల చేశారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఆలోచన చేయని రోజుల్లోనే పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్‌ఆర్, కాంగ్రెస్ మ్యానిఫెస్టో చైర్మెన్‌గా చక్రపాణి…పార్టీ అధ్యక్షులు సోనియాగాంధీ అనుమతితో 1999 ఎన్నికల్లో ఉచిత విద్యుత్‌ను ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చినట్టు తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్తు, విద్యుత్ బకాయిల మాఫీ, విద్యుత్ కనెక్షన్ల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నిటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో పరిష్కరించిందని గుర్తు చేశారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను యంత్రాలను ప్రవేశపెట్టడం, వాటి నిర్వహణలో రైతుకు తగిన శిక్షణ ఇవ్వడం, పనిముట్లను మెరుగుపరచడం, భూసార పరీక్షలు, పంట మార్పులపై ఎప్పటికప్పుడు సరైన సలహాలు ఇవ్వడం, మేలు రకం విత్తనాలు, పురుగు మందులు సమకూర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం, కల్తీదారులను కఠినంగా శిక్షించడం తదితర అంశాలను అప్పటి మ్యానిఫెస్టోలో పొందుపరిచా మన్నారు. ఇలాంటి వాస్తవాలను పట్టించుకోని బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో కాంగ్రెస్‌పై తప్పుడు కథనాలను ప్రసారం చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుకు బుద్ధి చెప్పాలని కోరారు. మెట్రో ఎక్కి సెల్ఫీ తీసి ఈ మెట్రో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చూపెడతామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు, ఈసీఐఎల్, బీహెచ్‌ఇఎల్, బీడీఎల్, తాగునీటి సౌకర్యం తదితరాంశాలను ఈ సందర్భంగా భట్టి ప్రస్తావించారు. ప్రతి అభివృద్ధిని సెల్ఫీ విత్ కాంగ్రెస్‌తో ప్రజల ముందుకు తీసుకు వెళతామని వివరించారు. ‘సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలంప్‌మెంట్’ వాట్సాప్ డీపీలో పెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.