సీనియర్‌ జర్నలిస్ట్‌ వై నాగేశ్వరరావుకు ఓయూ డాక్టరేట్‌ పట్టా

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌ వై.నాగేశ్వరరావు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు. ఓయూ తెలుగు శాఖ నుంచి ఆచార్య డి.చంద్రశేఖర్‌ రెడ్డి పర్యవేక్షణలో ”ఆధునిక తెలుగు సాహిత్యం- లౌకికవాదం” అనే అంశంపై పరిశోధన పూర్తి చేసినందుకుగాను ఆయనకు డాక్టరేట్‌ను అందించారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్‌ ఆడిటోరియంలో జరిగిన 83వ స్నాతకోత్సవంలో వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌, అమెరికాలోని అడోబ్‌ సంస్థ చైర్మన్‌ అండ్‌ సీఈవో డాక్టర్‌ శంతన్‌ నారాయన్‌లు ఆయనకు పట్టాను అందజేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా గత 34 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న వై. నాగేశ్వరరావు ప్రస్తుతం వార్త దినపత్రిక బ్యూరో చీఫ్‌గా పని చేస్తున్నారు. జర్నలిజం రంగంలో సేవలం దిస్తున్నందుకుగాను 2018 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ”విశిష్ట సేవా పురస్కారాన్ని” ( బెస్ట్‌ జర్నలిస్ట్‌ అవార్డు ) వై. నాగేశ్వరరావు అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామానికి చెందిన ఏనుగుల అండాలు నరసింహుల దంపతులకు 1964 సంవత్సరంలో ఆయన జన్మించారు. డాక్టరేట్‌ అందుకున్న సందర్భంగా డాక్టర్‌ వై.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆధునిక తెలుగు సాహిత్యాన్ని లౌకికవాద కోణంలో ఎంతో ఆసక్తితో పరిశోధించి తన సిద్ధాంత గ్రంథాన్ని పూర్తి చేశానని తెలిపారు. తన సిద్ధాంత గ్రంథంలో పొందుపరిచిన సాహిత్య విశ్లేషణ ద్వారా ఆధునిక తెలుగు సాహిత్యం ప్రజలను చైతన్యవంతం చేసిందని పేర్కొన్నారు. కుల, మత భేదాలు లేకుండా కలిసికట్టుగా జీవించే సమాజాన్ని ఆధునిక తెలుగు సాహిత్యం కోరుకుందన్నారు. దేశ సమైక్యతను కాపాడుకునేందుకు లౌకిక వాదంతో కూడిన మరిన్ని రచనలు రావాల్సిన అవసరం ఉందని ఆయన ఆకాంక్షించారు.