సెన్సెక్స్‌ ఏ84వేలు

సెన్సెక్స్‌ ఏ84వేలుముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు నూతన మైలురాయిని నమోదు చేశాయి. సెన్సెక్స్‌ తొలి సారిగా 84వేలు, నిఫ్టీ 25,800 పాయింట్ల మార్క్‌ను దాటాయి. శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1359.51 పాయింట్లు లేదా 1.63 శాతం ఎగిసి 84,544కి చేరింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 375 పాయింట్లు లేదా 1.48 శాతం పెరిగి 25,791 వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నాలుగేండ్ల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో మార్కెట్లకు కొత్త ఉత్సాహం లభించింది. ఈ క్రమంలో గురువారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆ ప్రభావం భారత మార్కెట్లపై పడింది. నిఫ్టీ 50లో 44 షేర్లు లాభపడ్డాయి. ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, కోల్‌ ఇండియా షేర్లు అత్యధికంగా 5.3 శాతం పెరిగాయి. మరోవైపు గ్రాసిం ఇండిస్టీస్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలను చవి చూశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు ఒక్క శాతం చొప్పున పెరిగాయి.