– చైనా స్టాక్ ఎక్సేంజీలకు భారీ లాభాలు
ముంబయి : వరుసగా ఆరు సెషన్లలో భారీ నష్టాలు చవి చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లకు ఎట్టకేలకు మంగళవారం ఉపశమనం లభించింది. ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన ప్పటికీ.. పలు పరిణామాల మధ్య కొనుగోళ్ల మద్దతుతో తుదకు బీఎస్‌ఈ సెన్స్‌క్స్ 584.81 పాయింట్లు లేదా 0.72 శాతం పెరిగి 81,634కు చేరింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 217 పాయింట్లు లాభపడి 25,013 వద్ద ముగిసింది. హర్యానా, జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్కెట్లు ప్రారంభంలో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరకు హర్యానా ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పెరగడం తో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. మరోవైపు ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను బుధవారం వెల్లడించనుంది. దీనిపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్ అండ్‌టీ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందువరుసలో ఉన్నాయి. మరోవైపు టాటా స్టీల్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి.
షాంఘై స్టాక్ ఎక్సేంజీ 4.59 శాతం వృద్ధి
వారం రోజుల తర్వాత తెరుచుకున్న చైనా మార్కెట్లు లాభాల్లో దుమ్మురేపాయి. ఇజ్రాయిల్- ఇరాన్ ఆందోళనలతో భారీ నష్టాలు చవి చూసే అవకాశాలున్నాయన్న నిపుణుల అంచనాలకు భిన్నంగా రాణించాయి. మంగళవారం షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 4.59 శాతం పెరిగి 3,489.78 పాయింట్లకు చేరింది. షెంజెన్ కాంపోనెంట్ ఇండెక్స్ ఏకంగా 9.17 శాతం లాభంతో 11,495.1 పాయింట్ల వద్ద ముగిసింది. 5,000 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. దేశ వృద్ధి కోసం ఇటీవల చైనా నూతన విధానాలను ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వ వ్యయం అమాంతం పెంచనున్నట్టు పేర్కొంది. దీంతో విదేశీ సంస్థాగత మదుపర్లు చైనా మార్కెట్లలో భారీగా పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు.