– కారును ఢ కొట్టిన బొలెరో వాహనం
– ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును బొలెరో వాహనం ఢ కొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా తాడ్వాయి సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం… ఫర్టిలైజర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన రాం కుమార్ కారులో హైదరాబాద్ నుంచి ఏటూరునాగారం వస్తున్నాడు. ఈ క్రమంలో తాడ్వాయి సమీపంలోని 163వ జాతీయ రహదారిపై బొలెరో వాహనం కారుకు ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢకొీట్టింది. దీంతో రాంకుమార్(40) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్సై ఓంకార్ యాదవ్ తన బలగాలతో సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ములుగు ఆస్పత్రికి తరలించారు. రాంకుమార్ మృతదేహాన్ని ఏటూర్‌నాగారం సీహెచ్‌సీ మార్చురి లో భద్రపరిచారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.