కొత్త పేస్కేలుతో సెర్ప్‌ ఉద్యోగుల్లో హర్షం

– మంత్రి ఎర్రబెల్లితో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కొత్త పేస్కేలు ప్రకటనతో పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఉద్యోగులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును సోమవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి మంత్రితో కలిసి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎర్రబెల్లికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ, కొత్త పే స్కేల్‌ ఇవ్వడం సీఎం కేసీఆర్‌ ఉదారతకు నిదర్శనమన్నారు. ఓపికతో ఉన్న వారికి తప్పకుండా ఆయన కచ్చితంగా న్యాయం చేస్తారనడానికి సెర్ప్‌ ఉద్యోగులకు పే స్కేలే ఉదాహరణ అని వివరించారు. మంత్రి ఎర్రబెల్లిని సెర్ప్‌ ఉద్యోగులు ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆ సంఘం నేతలు సుదర్శన్‌, వెంకట్‌, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.