– 2 కిలోల బంగారం, 100 కిలోల వెండి
– సెక్యూరిటీ లేకుండా తరలింపుపై అనుమానాలు
– పాలకమండలి సభ్యులకు సమాచారం ఇవ్వని వైనం
– బ్యాంకును తనిఖీ చేసిన దేవాదాయ శాఖ అధికారులు
నవతెలంగాణ – మెదక్
బ్యాంకులో భద్రపర్చాల్సిన ఏడుపాయల వనదుర్గకు చెందిన బంగారం, వెండిని ఈఓ ఇంట్లో పెట్టుకున్నారు. ఆలయంలో సందర్శకులు కానుకలుగా సమర్పించిన బంగారం, వెండిని నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ఈఓ తన ఇంటికి తరలించడం వివాదాస్పదమైంది. దేవాదాయ శాఖ అధికారులు బ్యాంకులో తనిఖీ నిర్వహించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మతా ఆలయంలో ముడుపుల రూపంలో వచ్చిన బంగారం, వెండి ఆభరణాలను హైదరాబాద్ చర్లపల్లి ప్రాంతంలోని మింట్ కాంపౌండ్ దేవాదాయ శాఖకు అందజేస్తారు. అక్కడ కరిగించి కడ్డీలుగా మార్చి ఆలయ ఖాతాలో బ్యాంకు లాకర్‌లో భద్రపరుస్తారు. అలా బంగారం, వెండిని 2020లో మింట్ కాంపౌండ్‌లో ఆలయ ఈఓ అందజేశారు. దాన్ని కడ్డీల రూపంలోకి మార్చగా.. సుమారు 2 కిలోల బంగారం, 100 కిలోల వెండిని ఆలయ ఈఓ సారా శ్రీనివాస్ శుక్రవారం రాత్రి తన ఇంటికి తీసుకెళ్లారు. ఏడుపాయల ఆలయ పాలకమండలికి ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా రూ.2 కోట్ల విలువైన బంగారం, వెండిని ఈఓ తన ఇంటికి తీసుకురావడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. విషయం బయటకు పొక్కడంతో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 7:10 గంటలకు గుట్టుచప్పుడు కాకుండా పోలీసు అధికారుల సహకారంతో మెదక్ ఇండియన్ బ్యాంక్ లాకర్‌లో భద్రపరిచారు.
రంగంలోకి దేవాదాయశాఖ అధికారులు
దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రామకృష్ణా రావు, ఆభరణాల తనిఖీ అధికారి అంజనాదేవి, మెదక్ జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ శివకుమార్, ఇతర అధికారులు మెదక్ ఇండియన్ బ్యాంక్‌ను సందర్శిం చారు. ఏడుపాయల దుర్గామాతకు సంబంధించిన లాకర్ తెరిచి పరిశీలించారు. బంగారం, వెండిని తూకం వేసి లెక్కలు వేశారు. దేవాదాయ శాఖ నుంచి రెండు కిలోల 940 గ్రాముల బంగారం, 72 కిలోల 513 గ్రాముల వెండి తీసుకురాగా.. ఇందులో వెండి 133 గ్రాములు తక్కువ ఉన్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా ఆర్జెడి రామకృష్ణారావు మాట్లాడుతూ.. ఏడుపాయలకు చెందిన బంగారం, వెండి ఆభరణాలను కరిగించి కడ్డిలుగా మార్చేందుకు జూన్ 4, 2020లో మింట్‌లో ఆలయ ఈఓ అప్పగించారని చెప్పారు. ఆ బంగారం, వెండి కడ్డీలను శుక్రవారం సాయంత్రం ఆలయ ఈవో సారా శ్రీనివాస్ పాలకమండలికి సమాచారం ఇవ్వకుండా మెదక్‌కు తీసుకొచ్చారన్నారు. పూర్తి వివరాలను కమిషనర్‌కు నివేదిక అందించనున్నట్టు వెల్లడించారు.
ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఈఓ : చైర్మెన్
ఆలయ ఈఓ శ్రీనివాస్ ఇష్టారీత్యా వ్యవహరిస్తున్నట్టు ఏడుపాయల చైౖర్మెన్ బాలాగౌడ్ అన్నారు. కొన్నేళ్లుగా ఏడుపాయల దుర్గామాతా బ్యాంక్ లావాదేవీలన్నీ మెదక్ ఇండియన్ బ్యాంకులో జరుగుతున్నట్టు తెలిపారు. ఈవో ఒక్కరికే చెక్ పవర్ ఉండటం వల్ల ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని, ప్రతి చెక్కు విషయంపై విచారణ చేపట్టాలని అధికారులను కోరారు. డైరెక్టర్స్‌తో కలిసి ఈఓ తీరుపై కలెక్టర్‌కు, కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.