నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడురోజులపాటు సంగారెడ్డిలో జరగనున్నాయి. తొలి రోజు విద్యార్థుల ప్రదర్శన, బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యఅతిథిగా ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను హాజరవుతారు. శనివారం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులతో సభ జరుగుతుంది. ఆదివారం విద్యారంగం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి భవిష్యత్ పోరాటాల కార్యక్రమాలను రూపకల్పన చేస్తారు. బీఆర్‌ఎస్ పాలనలో విద్యారంగం సంక్షోభంలోకి కూరుకుపోయిన విషయాలతో, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయకపోవడం, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలపై చర్చిస్తారు. అద్దె భవనాల్లో గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థుల వసతి, వారు ఎదుర్కొంటున్న సమస్యలపైనా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో చర్చిస్తారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిర్ణయం తీసుకుంటారు.