కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు అవమానం

–  సచివాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్న పోలీసులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు అవమానం జరిగింది. వివిధ శాఖలకు సంబంధించిన పనులపై సచివాలయంలోకి వెళ్లేందుకు వచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నియంతృత్వంగా వ్యవహరిస్తు న్నదని ప్రశ్నించారు. సచివాలయ నిర్మాణం గొప్పగా చూపి స్తున్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు అనుమతిం చడం లేదని అడిగారు. సీఎం ప్రజల వద్దకు రాడు, వచ్చే వాళ్లను అడ్డుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీలో విపక్షాల గొంతు నొక్కతున్నారని అన్నారు. సచివాలయం కేవలం బీఆర్‌ఎస్‌ నాయకులకేనా?అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతుకలు రావొద్దంటూ బోర్డు పెట్టాలని కోరారు.
హోంమంత్రి క్షమాపణ చెప్పాలి
హోంమంత్రి మహమూద్‌ అలీ అసహనంగా ఉన్నారని సీతక్క విమర్శించారు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాము ప్రజల్లో తిరుగుతుంటే కుటుంబ సభ్యుల్లా గన్‌మెన్‌లు చూసుకుంటారని అన్నారు. పోలీసు లంటే తమకు అభిమానం, గౌరవముందని చెప్పారు. గన్‌ మెన్‌పై హోంమంత్రి చేయిచేసుకోవడం సరైంది కాదన్నారు.