దళిత మహిళా సర్పంచుకు అవమానం

– ప్రోటోకాల్ పాటించని వైనం
– దళిత మహిళననే  మొదటి నుంచి ఇదేవివక్ష : అనూష
నవతెలంగాణ –  స్టేషన్ ఘనపూర్ 
కేసీఆర్ పాలనంటేనే మహిళా పక్షపాతిగా చెబుతూ అధికార పార్టీలోని చిన్నపాటి మహిళ నాయకురాలను ఏ ప్రోటోకాల్ లేకుండానే నిబంధనలు ఏమీ పట్టనట్లుగా అధికారిక సమావేశాల్లో సైతం ప్రాధాన్యత ఇచ్చే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, దళిత మహిళా సర్పంచనో, కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచనో తనను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తూ ప్రతీసారి తనను పిలిచినట్లు చేసి కొందరూ స్థానిక నాయకుల తీరుతో లెక్కలేకుండా చేస్తున్నారని ఓ దళిత మహిళా కాంగ్రెస్ పార్టీ చెందిన సర్పంచి ఆవేదన చెందింది. అధికారుల నిర్లక్ష్యమా…. ప్రజాప్రతినిధులకు పట్టింపు లేకపోవడమో గానీ సాక్షాత్తూ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,  ముఖ్య అతిథిగా పాల్గొన్న మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా  జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని రంగరాయి గూడెం గ్రామంలో అంగన్ వాడీ భవనం ప్రారంభోత్సవ సమావేశంలో  స్థానిక సర్పంచ్ దళిత మహిళ మోదుంపల్లి అనూషకు అవమానం జరిగింది. సమావేశం మొదట నుంచి తనను స్టేజీపైకి పిలువకపోవడంతో  వారి ప్రసంగం అయిపోయేంత వరకూ స్టేజీ పక్కనే నిలబడి ఉంది. కనీసం మహిళ అనే గౌరవం కూడా లేకుండా వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు అనూష వివరించింది. తాను కాంగ్రెస్ పార్టీ సర్పంచిననే స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా పట్టనట్లుగా వ్యవహరించడం గమనార్హం. మహిళా అధికారులు కూడా తనను లెక్క చేయలేదంటూ గుర్తించక పోవడం బాధాకరం అన్నారు. దాతల సాయంతో తాము ముందుండి అంగన్ వాడీ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడంతో, అధికార పార్టీ స్థానిక నాయకులకు నచ్చకపోవడం వల్లనే ఇలాంటి అవమానం జరిగిందని,  గతంలో కూడా రైతు వేదిక నిర్మాణంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని వాపోయారు. 10 యేండ్ల స్వరాష్ట్ర పాలనలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ అసహనం వ్యక్తం చేసింది. దళిత మహిళ సర్పంచినైన తనపై వివక్ష తగదని అన్నారు.