కేసీఆర్‌కు కౌంట్‌ డౌన్‌ స్టార్టైంది… :షర్మిల

– సోనియా, రాహుల్‌ తో షర్మిల భేటి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేసీఆర్‌ కౌంట్‌ డౌన్‌ స్టార్టైందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హెచ్చరించారు. గురువారం న్యూఢిల్లీ అక్బర్‌ రోడ్‌ 24 లో సోనియా, రాహుల్‌ గాంధీతో షర్మిల భేటి అయ్యారు. బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌లో భాగంగా భర్త బ్రదర్‌ అనిల్‌తో కలిసి దాదాపు 20 నిమిషాలకుపైగా కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో ముచ్చటించారు. ఈ భేటిలో తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో వైఎస్సార్‌ టీపీ కలిసి పనిచేసే అంశాలపై చర్చించినట్లు తెలిసింది.ముఖ్యంగా కాంగ్రెస్‌లో వైఎస్సార్‌ టీపీ పార్టీ విలీనం చేస్తారనే వార్తల నేపథ్యంలో ఈ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. మీటింగ్‌ అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. సోనియా, రాహుల్‌తో నిర్మాణాత్మకమైన చర్చ జరిగిందన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశలో రాజశేఖర్‌ రెడ్డి బిడ్డ నిరంతరం పని చేస్తుందన్నారు. కేసీఆర్‌కు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైందని చెప్పారు. అయితే కాంగ్రెస్‌లో పార్టీ విలీనం లేదా తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుపై మాట్లా డేందుకు షర్మిల నిరాకరించారు. ఈ దిశలో జర్నలిస్ట్‌లు వేసిన ప్రశ్నలకు సమాధానం దాటవేసారు. మిగితా అంశాలను హైదరాబాద్‌లో మాట్లాడు తానన్నారు. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ బయలు దేరి వెళ్లారు.