– రాజకీయాలపై చర్చ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కర్నాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ను వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం బెంగళూరులోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా వారి మధ్య రాజకీయ చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు తీసుకుని వైఎస్‌ఆర్ ఆశయాలకు అనుగుణంగా అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని డికె శివకుమార్ షర్మిలను కోరినట్టు తెలిసింది. ఏపీలో వైఎస్‌ఆర్, టీడీపీలను ఎదుర్కొనేందుకు షర్మిల బలమైన నేతగా కాంగ్రెస్ భావిస్తున్నది. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ కూడా షర్మిలతో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌టీపీ పొత్తు పెట్టుకునేందుకు డికే రాయబారం చేస్తున్నట్టు మరో వాదన కూడా వినిపిస్తున్నది. 15 రోజుల్లోనే డికేతో షర్మిల రెండుసార్లు భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది.