– మహరాష్ట్ర స్పీకర్ తీర్పు
ముంబయి: మహారాష్ట్రలో శివసేన చీలికపై ఆ రాష్ట్ర స్పీకర్ ఊహించినట్లుగానే తీర్పు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గ్రూపే అసలైన శివసేన అని రాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ బుధవారం తీర్పు ఇచ్చారు. శివసేన ఎమ్మెల్యేల్లో చీలికకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే, షిండే గ్రూపుల పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బుధవారం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. షిండే గ్రూపులోనే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న స్పీకర్.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరతూ దాఖలైన పిటిషన్లన్నింటినీ తిరస్కరించారు. అలాగే, శివసేన పార్టీ 2018 రాజ్యాంగాన్ని పరిగణించాలన్న ఉద్ధవ్ గ్రూపు అభ్యర్థనను స్పీకర్ తోసిపుచ్చారు. ఎన్నికల కమిషన్‌కు 1999లో సమర్పించిన ఆ పార్టీ రాజ్యాంగమే చెల్లుబాటవుతుందని తెలిపారు.
సుప్రీంకోర్టు వెళతాం : ఉద్ధవ్ ఠాక్రే
స్పీకర్ రాహుల్ నర్వేకర్ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో స్పందించారు. స్పీకర్ నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే కుట్రగా విమర్శించారు. స్పీకర్ నిర్ణయాన్ని శివసేన (యూబీటీ) గ్రూపు సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు చెప్పారు. ”స్పీకర్ రాహుల్ నర్వేకర్ తీరు చూస్తే ఆయన కుమ్మక్కైనట్లు తేలిపోయింది. ఆయన ప్రకటించిన నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పన్నాగమనే సందేహం నిన్ననే వ్యక్తం చేశాను. సుప్రీంకోర్టులో ధిక్కరణ కేసు వేయాలా.. లేదా అనేది చూస్తాం. ఒకవేళ మా పార్టీ రాజ్యాంగం చెల్లకపోతే.. మరి మమ్మల్ని ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదు? సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న విశ్వాసం మాకు పూర్తిగా ఉంది. మహారాష్ట్ర ప్రజలకు, శివసేనకు సుప్రీంకోర్టులో పూర్తి న్యాయం జరుగుతుంది” అని ఉద్ధవ్ అన్నారు.
ఇది బిజెపి కుట్ర: సంజయ్ రౌత్
షిండే గ్రూపే అసలైన శివసేన అని స్పీకర్ రాహుల్ నర్వేకర్ వెల్లడించిన నిర్ణయంపై శివసేన (యూబీటీ) నేత, ఎంపి సంజరు రౌత్ స్పందించారు. ‘ఇది బిజెపి కుట్ర. ఏదో ఒకరోజు బాలాసాహెబ్ ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేనను అంతం చేయాలన్నది వారి కల అన్నారు. అయితే, ఈ ఒక్క నిర్ణయంతో శివసేన ముగిసిపోదని.. తాము సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం’ అని అన్నారు.
2022 జూన్‌లో ఏక్‌నాథ్ షిండే దాదాపు 50 మంది ఎమ్మెల్యేలతో శివసేనలో చీలిక తెచ్చి, బిజెపికి మద్దతు ప్రకటించారు. తరువాత బిజెపితో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జూన్ 30న ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర కొత్త సీఎంగా నియమితులయ్యారు. ఈ పరిణామాలన్నింటిపై ఉద్ధవ్ గ్రూపు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అలాగే ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై 2024 జనవరి 10లోగా నిర్ణయం తీసుకోవాలని డిసెంబర్ 15న మహారాష్ట్ర స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ రాహుల్ నర్వేకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు.