ఏది నిజమైన శివాజీ వారసత్వం
మరాఠీ మూలం: గోవింద్ పన్సారె
ఇంగ్లీషు: ఉదరు నార్కర్
తెలుగు: ఎస్ వినయ కుమార్
పేజీలు : 96, వెల :90 /-
ప్రతులకు: నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్
1960 దశకంలో శివసేన ఏర్పడింది. ఆ పార్టీ మహారాష్ట్రేతరులపై, ముస్లింలపై వ్యతిరేకత రెచ్చగొట్టడానికి శివాజీ పేరును ఉపయోగించింది. ఈ శక్తులు అలాంటి సంస్థలను అనేకం సష్టించాయి. వారు ఆయన్ని గోబ్రాహ్మణ సంరక్షకుడిని చేశారు. దళిత పల్లెలపై దాడులు చేసినప్పుడు, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా వారు శివాజీ మహారాజ్ కి జై అనే నినాదాలు చేశారు. మొత్తానికి శివాజీని సవర్ణ హిందువును చేశారు. అంతే కాదు శివాజీని అవతార పురుషుడిగా, హిందూ మతోద్దారకుడిగా చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ గోవింద్ పన్సారె శివాజీ చరిత్రను పరిశోధించి వాస్తవాలను వెలికితీస్తూ ఈ పుస్తకాన్ని రాశారు.
ఇతర రాజుల కంటే భిన్నంగా శివాజీ రైతుల ఆస్తులను, పంటలను సైనికులు లూటీ చేయకుండా రక్షణ కల్పించారు. సైన్యం కానీ, ఫ్యూడల్ వర్గాలు కానీ, రాజాధికారులు కానీ స్త్రీలపై అత్యాచారాలు చేయకుండా కట్టుదిట్టం చేశారు. శివాజీ కాలం నాటికి అధికార భాషగా ఉన్న పారసీని తప్పించి మరాఠీని పాలనా భాషగా చేశాడు. శివాజీ తన సైన్యాన్ని రైతుల నుండి సృష్టించుకున్నాడు. విదేశీ వ్యాపారంపై దిగుమతి పన్ను విధించి స్థానిక ఉత్పత్తిని, వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు. బానిస వ్యాపారాన్ని నిషేధించాడు. ఇలాంటి ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టాడు.
శివాజీ దగ్గర చాలా మంది ముస్లింలు పనిచేసేవారు. సైన్యంలోనూ, పరిపాలనలోనూ ముఖ్యమైన బాధ్యతల్లో ఉండేవారు. ఒకవేళ శివాజీ లక్ష్యం ఇస్లాం మతాన్ని అంతం చేయడమే అయితే ముస్లింలు ఆయన సైన్యంలో చేరి ఉండరు. శివాజీకి వాడే బిరుదులలో గో బ్రాహ్మణ ప్రతిపాలక్ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఎక్కడ తాను గో బ్రాహ్మణుల రక్షకుడినని శివాజీ చెప్పుకోలేదు. మహారాష్ట్రలోని చాలామంది బ్రాహ్మణులు శివాజీని రాజుగా పట్టాభిషిక్తుని చేయడానికి అంగీకరించలేదు. కొందరు బ్రాహ్మణులు శివాజీ ఓటమి కోసం మీర్జా జై సింగ్ తరఫున యాగం కూడా చేశారు. శివాజీ శూద్రుడని తక్కువ కులం వాడని బ్రాహ్మణులు మాత్రమే వేధించలేదు. ఆనాడు మహారాష్ట్రలోని రాజవంశీయుల 96 ఘన కుటుంబాలు, తాము క్షత్రియులం అని భావించేవారు వారికి రాజ్యం లేకపోయినా సరే శివాజీని వారు మొదట్లో రాజుగా ఒప్పుకోలేదు. వారణాసి నుండి గాగబట్టు అనే బ్రాహ్మణుడు వచ్చి వైదిక నియమాల ప్రకారం పట్టాభిషేకం చేయించాడు.
శివాజీ చరిత్ర నుండి స్వీకరించాల్సింది చాలానే ఉంది. ఆయన ఆలోచనలు, ఆచరణ, ఆయన సాధించిన దానిలో స్వీకరించవలసిన స్ఫూర్తి ఎంతో ఉందని నిరూపిస్తూ గోవింద్ పన్సారె మరాఠీ లో ఈ పుస్తకాన్ని వ్రాశారు. మరాఠీ నుండి ఇంగ్లీషులోకి ఉదరు నార్కర్ అనువదించగా, ఎస్ వినరు కుమార్ తెలుగులోకి తీసుకువచ్చారు. అనువాదం చాలా బాగుంది. ఆలోచనలు రేకెత్తించే ఈ పుస్తకం అందరూ చదవదగింది.