మహారాష్ట్రలో బీజేపీకి షాక్‌

– పవార్‌ గూటికి చేరిన నవీ ముంబయి నేత
ముంబయి : మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ నవీ ముంబయి జిల్లా అధ్యక్షుడు సందీప్‌ నాయక్‌ మంగళవారం పార్టీకి రాజీనామా చేసి శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. బేలాపూర్‌ శాసనసభ స్థానం నుండి పోటీ చేసేందుకు సందీప్‌కు బీజేపీ టిక్కెట్‌ నిరాకరించింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మందా మాత్రేని మళ్లీ బరిలో దింపింది. దీంతో ఆగ్రహించిన సందీప్‌ పార్టీ ఫిరాయించారు. ఆయన బేలాపూర్‌ స్థానం నుండే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. నవీ ముంబయి ప్రాంతంలో సందీప్‌ కుటుంబానికి మంచి పట్టుంది. అయితే సందీప్‌ తండ్రి గణేష్‌ నాయక్‌కు నవీ ముంబయిలోని అయిరోలీ స్థానాన్ని బీజేపీ కేటాయించింది. సందీప్‌ను బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేసేందుకు బీజేపీ నాయకత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.