ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్‌డీల కొరత

న్యూఢిల్లీ : దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో పీహెచ్‌డీల కొరత ఎక్కువగా ఉంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం ఈ సంస్థ ర్యాంకింగ్స్‌లో ఉన్న తొలి 100 కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల్లో సగటున 61.6% మందికి మాత్రమే పీహెచ్‌డీ డిగ్రీలు ఉన్నాయి. ఇతర విద్యా సంస్థల్లో ఈ శాతం 44.63గానే ఉంది. అయితే దేశంలోని మేనేజ్‌మెంట్‌ విద్యా సంస్థల్లో అత్యధికంగా 91.60% మందికి డాక్టరేట్‌ డిగ్రీ ఉంది. ఇతర కళాశాలల్లో ఇది కేవలం 61% మాత్రమే. ర్యాంకింగ్స్‌లో మొదటి 100 స్థానాల్లో ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లోనే డాక్టరేట్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇతర సంస్థలు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీలున్న వారితోనే నెట్టుకొస్తున్నాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ ఉన్న మొదటి 100 కళాశాలలు పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నాయని, అందుకే ఆ సంస్థల్లో దాదాపు అందరు అధ్యాపకులకూ పీహెచ్‌డీ డిగ్రీలు ఉన్నాయని యూజీసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.జగదీష్‌ కుమార్‌ చెప్పారు. వాణిజ్య శాస్త్రం, న్యాయశాస్త్రం, వాస్తు శాస్త్రం, విదేశీ భాషలలో పీహెచ్‌డీ చేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఆయా కోర్సులు బోధిస్తున్న కళాశాలలు పీహెచ్‌డీ అధ్యాపకుల కొరతను ఎదుర్కొంటున్నాయి. టాప్‌ 100 కళాశాలల్లో ఇంజినీరింగ్‌ కాలేజీలో ఎక్కువగా ఉన్నాయి. వీటిలో 81.20% మంది పీహెచ్‌డీలు ఉన్నారు. మిగిలిన ఇంజినీరింగ్‌ కాలేజీల్లో వీరి సంఖ్య కేవలం 34.94 శాతం మాత్రమే. ఇక ఉత్తమ యూనివర్సిటీల విషయానికి వస్తే టాప్‌ 100 విశ్వవిద్యాలయాలలో పీహెచ్‌డీ చేసిన అధ్యాపకులు 73.60%గా ఉన్నారు. అయితే ఫార్మసీలో పీహెచ్‌డీ చేసిన వారు చాలా తక్కువ.