కారును పోలిన గుర్తులను రద్దు చేయాలి

– ఢిల్లీ కోర్టులో బీఆర్‌ఎస్‌ పిటిషన్‌
– అంతలోనే వెనక్కి తీసుకున్న గులాబీ దళం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కారును పోలిన గుర్తులు తొలగించాలంటూ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్‌ఎస్‌ నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ సానుకూలమైన ఫలితం రాకపోవడంతో గురువారం ఉదయం ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టును ఆ పార్టీ నేతలు ఆశ్రయించారు. కారును పోలి ఉన్న గుర్తులను ఏ పార్టీకీ కేటాయించొద్దంటూ బీఆర్‌ఎస్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అలా కేటాయించడం వల్ల తమ పార్టీకి నష్టం జరుగుతోందని రిట్‌ పిటిషన్‌లో ఆ పార్టీ పేర్కొంది. బీఆర్‌ఎస్‌ తరపున న్యాయవాది మోహిత్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టే లోపే బీఆర్‌ఎస్‌ ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది.
ఇదే అంశంపై సుప్రీంకోర్టుకు
అలా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేయడం.. మళ్లీ వెనక్కి తీసుకోవడం ఇవన్నీ గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. తాజాగా ఇదే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. కారును పోలిన గుర్తులను ఎన్నికల కమిషన్‌ తొలగించాలని ఆదేశాలు ఇవ్వాలంటూ భారత రాష్ట్ర సమితి ధర్మాసనాన్ని ఆశ్రయించనుంది. ధర్మాసనం ఎలా రియాక్ట్‌ అవుతుంది..? కారు పార్టీకి అనుకూలంగా తీర్పు ఉంటుందా..? లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది. అనేదానిపై సర్వత్రా ఆసక్తి, అంతకుమించి బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల కారణంగా కొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌ పార్టీకి నష్టం జరిగింది. ఈసారి అలా జరగకూడదని ఆ పార్టీ భావిస్తోంది.