సిమ్‌కార్డ్‌ నిబంధనలు కఠినతరం

– అడ్డగోలు అమ్మకాలకు తెర
– రిటైలర్లకు కెవైసి తప్పనిసరి
– లేదంటే రూ.10 లక్షల జరిమానా
– టెల్కోలకు డిఒటి ఆదేశాలు3
న్యూఢిల్లీ: సిమ్‌ కార్డుల జారీ విధానాన్ని కఠినతరం చేస్తూ కేంద్ర టెలికం శాఖ (డిఒటి) నూతన నిబంధనలు రూపొందించింది. అక్టోబర్‌ నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. సిమ్‌ కార్డు కొనుగోలు చేసేవారు, విక్రయించేవారు నూతన నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఇకపై తమ కంపెనీ సిమ్‌ కార్డులు విక్రయించే దుకాణాలు, రిటైలర్లను ఆయా టెలికం కంపెనీలు కచ్చితంగా తనిఖీ చేసి.. కెవైసిలను పరిశీలించి.. గుర్తింపును ఇవ్వాల్సి ఉంటుంది. సిమ్‌ కార్డుల విక్రయాల్లో భద్రత పెంచేందుకు డిఒటి కొత్త నిబంధనలను జారీ చేసిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కంపెనీలు రిటైలర్లను తనికీ చేయడంతో పాటుగా వారికి గుర్తింపును ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారికి సిమ్‌ కార్డుల విక్రయానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 30లోగా టెలికాం కంపెనీలు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని డిఒటి స్పష్టం చేసింది. అక్రమంగా, నిబంధనలకు విరుద్దంగా సిమ్‌కార్డులను విక్రయిస్తే ఒక్కో రిటైలర్‌కు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించాల్సి ఉంటుందని డిఒటి నిబంధనల్లో పేర్కొంది. దేశంలో సిమ్‌ కార్డుల దుర్వినియోగాన్ని నిలువరించేందుకు కేంద్రం నిబంధనలను కఠినతరం చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
అక్కడ పోలీసు శాఖ అనుమతి తప్పనిసరి..
కొత్త రిటైటర్లతో పాటుగా ప్రస్తుత విక్రయదారులను కూడా టెలికం కంపెనీలు తనిఖీ చేసి.. కెవైసి పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే విధంగా అసోం, కాశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల్లో సిమ్‌ కార్డులు విక్రయించే దుకాణాలను ఏకంగా పోలీసు శాఖ తనిఖీలు చేస్తుంది. ఆ తర్వాత టెలికాం కంపెనీలు దుకాణదారులతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని డిఒటి వెల్లడించింది.
ఆధార్‌ తప్పనిసరి..!
ఇకపై కొత్త సిమ్‌ కార్డులు తీసుకునే సమయంలో ఆధార్‌ గుర్తింపు కార్డుతోనే కెవైసి పూర్తి చేయాలని డిఒటి సూచించినట్లు సమాచారం. పాత సిమ్‌ కార్డ్‌ పాడైనా, పోగొట్టుకున్న ఆధార్‌ను సమర్పించి.. కొత్తది తీసుకోవాల్సి ఉంటుంది.