– హైకోర్టులో కేంద్రం పిటిషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగానే ఉన్నామని హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే సింగరేణి కంపెనీ లిమిటెడ్ యాజమాన్యం ఎన్నికల నిర్వహణకు సహకరించడంలేదని చెప్పింది. ఫలితంగానే హైకోర్టు ఆదేశించినా ఎన్నికలను నిర్వహించలేకపోయినట్టు వివరించింది. జూన్ 22న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈనెల 28న ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ కూడా విడుదల చేసినట్లు పేర్కొంది. ఎన్నికలను నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం సహకరించకపోగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉన్నారనే పేరుతో ఎన్నికలను వాయిదా వేయాలని కోరిందని ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ వేసిందని కేంద్ర ప్రభుత్వం తరఫున కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ కమిషనర్ డి శ్రీనివాసులు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎన్నికల నిర్వహణకు గడువు పొడిగించాలన్న సింగరేణి యాజమాన్యం అప్పీల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వివరాలను తెలియజేస్తున్నట్టు చెప్పారు. యాజమాన్యం సహకరించకపోవడంతో ఓటర్ల జాబితా ప్రకటన వెలువడలేదని తెలిపారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గతనెల 22న సమావేశం నిర్వహించాలని కోరితే, ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరిందని వివరించారు. పోలింగ్ బూత్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి మూడు బృందాలను పంపినట్టు తెలిపారు. ఈ నెలలోగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఉత్తర్వులున్నా సింగరేణి యాజమాన్యం సహకరించడంలేదని వివరించారు. ఎన్నికల నిర్వహణకు సహకరించేలా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం, యూనియన్లకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును కోరింది.
హుక్కా సెంటర్లపై తీర్పు రిజర్వు
హైదరాబాద్ నగరంలోని పలు హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు చేయడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణను ముగించింది. సుమారు 68 పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు ఇటీవల పూర్తయ్యాయి. దీంతో తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు జస్టిస్ భాస్కర్ రెడ్డి సోమవారం వెల్లడించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంతోష్ కుమార్ వాదిస్తూ చట్టంలో హుక్కా పార్లర్, హుక్కా సెంటర్ అన్నదానికి నిర్వచనమే లేదన్నారు. చట్టంలో లేనప్పుడు హుక్కా కేంద్రాల నిర్వహణకు అధికారమే లేదని చెప్పారు. జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని పిటిషనర్లు చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. హుక్కా కేంద్రాలు అందిస్తున్న సేవలు అర్థం కావడం లేదన్నారు. పొగాకు నియంత్రణ చట్టానికి లోబడి హుక్కా సెంటర్లను నిర్వహిస్తున్నట్టు పిటిష నర్ల లాయర్ చెప్పారు. పోలీసులు దాడులు చేయడం వల్ల, హుక్కా కేంద్రాలను మూసేయడం వల్ల ఎంతోమంది జీవనోపాధి దెబ్బతింటుం దనివివరించారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.