– 6, 7 తేదీల్లో నామినేషన్ల దాఖలు, 9న ఉపసంహరణ
– 10న స్క్రూట్నీ, గుర్తుల కేటాయింపు
– ఓటింగ్ ముగిసిన వెంటనే లెక్కింపు
– ఫలించని యాజమాన్యం ఎత్తుగడలు
– కార్మిక సంఘాల మధ్య చిచ్చుకు యత్నం
నవతెలంగాణ – సింగరేణి ప్రతినిధి
సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికలు అక్టోబర్ 28న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ లేబర్ కమిషనర్ (సెంట్రల్) డి.శ్రీనివాసులు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. 14 కార్మిక సంఘాల్లో 11 కార్మిక సంఘాల నాయకులు ఎన్నికలను వాయిదా వేయాలని లిఖితపూర్వకంగా ఎన్నికల అధికారిని కోరారు. ఏఐటీయూసీ, బీఎంఎస్ సంఘాల నాయకులు మాత్రం ఎన్నికలు నిర్వహించాలని అధికారుల ముందు గట్టిగా వాదించారు. ఈ క్రమంలో ముందుగా ఖరారు చేసుకున్న విధంగా జరగాల్సిన త్రైపాక్షిక సమావేశానికి సింగరేణి యాజమాన్యం, 11 కార్మిక సంఘాల నాయకులు హాజరు కాలేదు. ఏఐటీయూసీ, బీఎంఎస్ నాయకులు మాత్రమే హాజరయ్యారు. వీరితోనే కార్మికశాఖ అధికారి సమావేశమై అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. మెయిల్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేసిన 11 కార్మిక సంఘాల లేఖలను కూడా పరిశీలించిన అనంతరం ఎన్నికల నిర్వహణకే రిటర్నింగ్ ఆఫీసర్ మొగ్గు చూపారు. ఈ నెల 30 వరకు ఓటర్ జాబితా తయారు చేయాలని సింగరేణి యాజమాన్యానికి కార్మిక శాఖ అధికారి లిఖితపూర్వకంగా అందజేశారు. అక్టోబర్ 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లోని కేంద్ర కార్మిక శాఖ అధికారి కార్యా లయంలో నామినేషన్లు తీసుకోవచ్చని తెలిపారు. ఎనిమిదో తేదీన నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. 10న స్క్రూట్నీ చేసి, గుర్తులను కేటాయి స్తామని ఉత్తర్వులలో వివరించారు. ఓటింగు ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపడు తామని ఎన్నికల అధికారి వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగడానికి కార్మిక సంఘాల నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం సహకరించాలని రిటర్నింగ్ ఆఫీసర్ లేఖలో కోరారు. సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికల నిర్వ హణకు యాజమాన్యంతో పాటు మెజార్టీ కార్మిక సంఘాలు సుముఖంగా లేకపోయి నప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినట్టు తెలుస్తోంది.
11 కార్మిక సంఘాలు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో యాజమాన్యంతో పలు అంశాలపై చర్చించాయి. సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికల అనంతరమే జరపాలని కోరుతూ ఆయా కార్మిక సంఘాల నాయకులు విడివిడిగా ప్రాంతీయ కార్మిక శాఖ అధికారులకు వినతిపత్రాలు పంపగా.. వాటిని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికల ప్రక్రియ కార్మిక సంఘాల మధ్య చిచ్చురాజేసినట్టు కనబడుతోంది. సింగరేణిలో గుర్తింపు ఎన్నికలను కోడ్ ఆఫ్ డిసిప్లిన్‌లో మార్పులు చేసిన అనంతరమే నిర్వహించాలని యాజమాన్యాన్ని ఉమ్మడిగా డిమాండ్ చేశారు. గెలిచిన సంఘం గుర్తింపు కాలపరిమితి రెండేండ్లు మాత్రమే ఉండాలని, కాంట్రాక్టు కార్మికులకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని ఏఐటీయూసీ, బీఎంఎస్ సంఘాలు మినహా మిగతా 12 కార్మిక సంఘాలు యాజమాన్యంతో చర్చించాయి. లాభాల వాటా చెల్లింపు సందర్భంగా కార్మికుల నుంచి చందాలు, సభ్యత్వం స్వీకరించే విధంగా కార్మిక సంఘాలకు అనువైన తేదీ ఖరారు చేయాలని కూడా డిమాండ్ చేశాయి. వేర్వేరుగా జరిగిన సమావేశాలలో ఏఐటీయూసీ, బీఎంఎస్ నాయకులు వి.సీతారామయ్య, యాదగిరి సత్తయ్య, హెచ్‌ఎంఎస్, సీఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు రియాజ్ అహ్మద్, రాజారెడ్డి, నరసింహారావు, జనప్రసాద్, నరసింహరెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు రాజిరెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు. ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్టీయూ గని కార్మిక సంఘంతో పాటు పలు సంఘాలు పాల్గొన్నాయి.