కవి, కథా రచయిత, విమర్శకుడు, పత్రికా సంపాదకుడు, పాఠ్య పుస్తక రచయిత. తొలుత తెలంగాణ బాల సాహిత్య పరిషత్తులో, ఇవ్వాళ్ల తెలంగాణ రచయితల వేదికలో బాధ్యుడు డా|| బెల్లంకొండ సంపత్ కుమార్. మెదక్ జిల్లాలోని నార్సింగిలో జులై 7, 1965లో పుట్టాడు. శ్రీమతి బెల్లంకొండ భారత లక్ష్మి, శ్రీ నరసింహాచార్యులు వీరి అమ్మానాన్నలు.
విద్యార్థి దశనుండే కవిత్వం రాయడం ప్రారంభించిన బాల కవి సంపత్ కుమార్. ఆయన తన తొలి కవిత తొమ్మిదవ తరగతి విద్యార్థిగా రాశాడు. ఎం.ఎ. తెలుగు చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ’20వ శతాబ్దపు మెదక్ జిల్లా రచయితల సాహిత్యం – వివిధ ధోరణులు’ అంశంపై పిహెచ్.డి చేశారు. తెలంగాణ ఆవిర్భావ సందర్భంలో డా||భూపాల్, డా||వి.ఆర్. శర్మలతో కలిసి తెలంగాణ బాలసాహిత్య పరిషత్తును ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మెదక్ జిల్లా నుండి తెచ్చిన బాలల రచనల విషయంలో సంపత్ ముందువరుసలో నిలిచి పనిచేశారు. విద్యార్థి రచయితలను వెన్ను, పెన్ను తట్టి ప్రోత్సహించిన డా||సంపత్ వివిధ ప్రక్రియలు, రూపాల్లో పిల్లలతో రచనలు చేయించారు. పాఠశాల గోడపత్రిక ద్వారా ఎందకో బాల రచయితల్ని తయారుచేసి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, విద్య, హేతువు వంటి వాటితో పిల్లలతో కథలు, కవిత్వం రాయించి, నాటకలు వేయించారు. అనేక బాలసాహిత్య కార్యశాలలకు విషయనిపుణులుగా ఉండటమే కాక స్వయంగా పిల్లల కోసం కార్యశాలలు జరిపారు. తెలంగాణ ఉపాధ్యాయ పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. రచనల చెరువు సాహితీ బులెటన్లకు సంపాదకత్వం వహిస్తున్నారు.
కవిగా సంపత్ తొలి సంతకంగా తెచ్చిన పుస్తకం ‘ఒక వేకువ కోసం’ కవిత్వం. తరువాత తెలంగాణ యోధుడు ‘విస్మృత వీరుడు కేవల్ కిషన్’ జీవిత కథను మనకోసం తెచ్చాడు. విద్వత్కవి వేముగంటి నరసింహాచార్యుల జీవిత కథను సంక్షిప్తంగా అందించాడు. అవధాని ‘గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ’ మోనోగ్రాఫ్ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమి వారికోసం తెచ్చాడు. తెలంగాణ సాహిత్య అకాడమి కోసం ‘మెదక్ జిల్లా సాహిత్య చరిత్ర’ కూర్చాడు. కవి వారం కవితా సంకలనాలకు సంపాదకులుగా, తొలినాళ్ళలో తెలంగాణ రచయితల వేదిక తెచ్చిన ‘సోయి’కి సంపాదకులుగా ఉన్నారు. 2019లో ‘నూరు పూలు’ తన సంపాదకత్వంలో తెచ్చారు. తెలంగాణ విస్మృత కవులు రచయితల సాహిత్యంపై పరిశోదన చేసి సాధికారిక వ్యాసాలు రాసిన సంపత్ అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పత్రసమర్పణ చేశారు. జనసాహితి మెదక్ యూనిట్, మంజీర కళా సమితి, రామాచంపేట, సింగిడి మెదక్ జిల్లా వంటి సంస్థల ఆవిర్భావాల్లో ఉన్న సంపత్ రచనల చెరువు వ్యవస్థాపక అధ్యక్షుడు. బి.ఎస్. రాములు కథా పురస్కారం, లయన్స్ క్లబ్ వారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, గుర్రం జాషువా అవార్డు, బసవేశ్వర పురస్కారం, డాక్టర్ మాడనాగభూషణం సాహితీ పురస్కారం, సుదర్శనం హనుమాండ్లు స్మారక పురస్కారం వంటివి సంపత్ అందుకున్న పురస్కారాలు, గౌరవాలు.
పిల్లల కోసం వందలాది కథలు, గేయాలు, నాటికలు రాసిన సంపత్ బాలలకు తాయిలంగా తెచ్చిన పుస్తకం ‘పల్లెపూల వాన’. సంపత్ కథలన్నీ బాలల వైజ్ఞానిక కోణం నుంచి రాసిన రచనలు. ఇందులో బాలలను వాళ్ళ నేపథ్యాన్ని, కుటుంబాలను వాళ్ళవాళ్ళ స్థితిగతులకు అక్షర రూపం యిచ్చారు రచయిత. ఒక రకంగా ఈ పల్లెపూల వాన బాలల సమస్తం, సర్వస్వాన్ని చక్కగా చర్చిస్తుంది, వెన్నుతట్టి లేపుతుంది, మొద్దు నిద్దరను వదిలిస్తుంది, కళ్ళను తెరిపిస్తుంది, చర్నాకోలతో చరుస్తుంది. ముఖ్యంగా బాల సాహిత్యం అంటే కేవలం జంతువుల కథలు, నీతి వాక్యాలు మాత్రమే అనుకున్న వాళ్ళకు ఈ కథల పుస్తం ఒక్క చరుపు చరుస్తుంది. బాలల్లో చేతనతోపాటు సామాజికస్పృహ తెచ్చేందుకు తన కథలను వేదికగా మలచురున్నారు సంపత్. అటువంటివే ఇందులోని ‘కలల కుటుంబం’ కథ. ‘పల్లెపూలవాన’ గొప్ప కథ. మతం కన్నా మానవత్వం మిన్న అని చాటిచెప్పేలా రచయిత దీనిని రాశాడు. అందులోనూ గ్రామాలు మానవ సంబంధాలకు ఎలా కూరాడుల్లా ఉన్నాయో చూపిస్తాడు కూడా. పల్లె-పట్నం వాతావరణాన్ని ‘ఓర్వలేని తనం’ కథలో చూడొచ్చు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న బాల కార్మిక వ్యవస్థను చదువుల పండుగ కథలో చూపిస్తాడు రచయిత. హేతువాదం వైజ్ఞానిక దృష్టితో రాసిన కథ ‘దయ్యాల చింత తీరింది’. ఇందులో రచయిత అమ్మాయిని హీరోగా చేయడం బాగుంది. సామాన్య జనుల గాథల్లో ఒకటైన ‘జాడ తెలువని బాల్యం’ కథ చదవాల్సిందే. పన్నెండు కథల ఈ సంపుటిలో సంపత్ తెలంగాణ జీవితాల్నేకాక, తెలంగాణ బాషను పాత్రోచితంగా ప్రయోగించడం దీనికి మరితం అందాన్నిచ్చింది. ఇది నార్సింగి బురుజు మీద పూసిన బాలల కథల సింగిడి. కథల కొండ బెల్లంకొండ సంపత్ కుమార్ బాలల కథలన్నీ చందమామను చూసి గోరుముద్దలు తినే బాలల పక్షాన కాకుండా బాల్యానికి దూరమై, ఆలనాపాలనలకు నోచుకోని బాలలకు వకాల్తా పుచ్చుకుని నిలుస్తాయి. జయహో బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్
9966229548