– యూపీలో మరో ఘోరం
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో భూవివాదంలో ఆరుగురు హత్యకు గురయ్యారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ దారుణ సంఘటన డియోరియా జిల్లా ఫతేపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఫతేపూర్‌లోని ప్రేమ్ యాదవ్, సత్య ప్రకాష్ దూబే కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా భూవివాదం నడుస్తోంది. సోమవారం ఉదయం సత్య ప్రకాష్ దూబే ఇంటికి వెళ్లి ప్రేమ్ యాదవ్ గొడవపడ్డాడు. దూబే, అతని కుటుంబ సభ్యులు ప్రేమ్ యాదవ్‌పై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశారు. దీంతో యాదవ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు దూబే ఇంటిపై, కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దీంతో దూబే కుటుంబంలోని ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. చికిత్స పొందుతూ ఐదుగురు మరణించారు. మరొకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. భూవివాదం కారణంగానే ఈ హత్యలు జరిగాయని జిల్లా ప్రత్యేక డిజిపి (శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు.