అస్సాం బాంబు పేలుళ్ల కేసులో నిర్దోషులుగా ఆరుగురు

– ‘సంశయ లబ్ది’తో హైకోర్టు తీర్పు
గౌహతి : రెండు దశాబ్దాల క్రితం అస్సాంలో జరిగిన భీకర బాంబు పేలుళ్ల కేసులో ఆరుగురు నిందితులను గౌహతి హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో దిగువ కోర్టు విధించిన జైలు శిక్షను కొట్టివేస్తూ వీరిని ‘సంశయ లబ్ది’ (బెనిఫిట్‌ ఆఫ్‌ ది డౌట్‌) కింద విడుదల చేస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. అస్సాంలోని ధేమాజీ కాలేజీ గ్రౌండ్స్‌లో 2004 ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతుండగా ముష్కరులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. నాటి ఘటనలో 13 మంది చిన్నారులు సహా 18 మంది చనిపోయారు. మరో 40 మంది గాయపడ్డారు. ఈ పేలుడుకు పాల్పడింది తామేనని యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అసోమ్‌ (ఉల్ఫా) ప్రకటించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. 2019లో ధేమాజీ జిల్లా సెషన్స్‌ కోర్టు వీరిని దోషులుగా తేల్చింది. లీలా గొగొరు, దీపాంజలి బురాగొహైన్‌, ముహీ హాందిక్‌, జతిన్‌ దుబోరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా.. మరో ఇద్దరు ప్రశాంత్‌ భుయాన్‌, హెమెన్‌ గొగొరుకి నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అయితే, ఈ తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్‌ చేశారు. వీరి అప్పీళ్లపై జులై 24న విచారణ ముగించిన హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కాగా హైకోర్టు తీర్పుపై బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.