‘మీ భయాన్ని జయిస్తే మీరు ఏదైనా సాధించగలరు’ అంటారు మానసిక నిపుణులు. కానీ ఆమె తనలోని భయాన్ని జయించడమే కాదు ఇప్పటి వరకు ఏ మహిళా వెళ్ళని చోటుకు వెళ్ళింది. ఉత్తర ధ్రువం.. దక్షిణ ధ్రువం.. ఎవరెస్ట్ శిఖరం మీదుగా స్కైడైవ్ చేసిన మొదటి మహిళగా శీతల్ మహాజన్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఆమె పరిచయం నేటి మానవిలో…
నలభై ఏండ్లు దాటిన స్కైడైవర్ శీతల్ మహాజన్ ఇటీవలె ఎవరెస్ట్ పర్వతం ముందు 21,500 అడుగుల ఎత్తు నుండి హెలికాప్టర్ నుండి దూకింది. ప్రపంచంలోనే ఇలాంటి సాహసం చేసిన మొదటి మహిళగా చరిత్రలో నిలిచిపోయింది. ప్రపంచంలోనే ఉత్తర ధ్రువం, దక్షిణ ధృవం, ఎవరెస్ట్ పర్వతం అనే మూడు ధ్రువాలపై స్కైడైవ్ చేసిన మొదటి మహిళ కూడా మహాజన్ మాత్రమే. సాహసం చేసిన మూడు రోజుల్లోనే ఎన్నో జాతీయ, ప్రపంచ రికార్డులు అందుకుంది. 2006లోనే మహాజన్ దక్షిణ ధ్రువంపై స్కైడైవింగ్ పూర్తి చేసింది. అయితే ఎవరెస్ట్ పర్వతం అప్పటికి ఇంకా చేరుకోలేదు. ఆమె మొత్తం ఏడు ఖండాల్లో స్కైడైవ్‌కు వెళ్లింది. 2008లో వివాహం చేసుకుంది. ఏడాది తర్వాత కవల పిల్లలకు జన్మనించింది. ఎవరెస్ట్ స్కైడైవ్ ఒక్కటి ఆమెకు అసంపూర్తిగా మిగిలిపోయింది. అయితే అదేమీ ఆమెకు కష్టమైనది కాదు.
కలను సాకారం చేసుకోడానికి
‘గత ఏడాదే నేను దీన్ని ప్రయత్నించాలని అనుకున్నాను. ఇప్పటికే ఓ మహిళ ఎవరెస్ట్ పర్వతం, దక్షిణ ధ్రువాన్ని పూర్తి చేసింది. ఉత్తర ధ్రువం మాత్రమే మిగిలి ఉంది. ఇది మూడు ధృవాల మీదుగా స్కైడైవింగ్ చేయా లనే నా కలను సాకారం చేసుకోవడానికి కృషి చేయడానికి నన్ను ప్రేరేపించింది’ అని మహా జన్ అన్నది. డైవ్ చేయాలంటే రూ. 65 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. దీని కోసం 200 కంపెనీ లను సంప్రదించింది. కొన్ని స్పాన్సర్‌షిప్‌లను అందు కుంది. ఆ ఖర్చులో 20శాతం మాత్రమే ఆమె వద్ద ఉన్నాయి. మిగిలినది రిలయన్స్ ఫౌండేషన్ అందించింది.
ఆకాశమే హద్దుగా
నవంబర్ 7న మహాజన్ బృందం ఎవరెస్ట్ ప్రాంతంలోని లుక్లా, ఫాడ్‌కింగ్, నామ్‌చే బజార్‌కి ఎక్కి స్యాంగ్‌బోచే విమానాశ్రయానికి చేరుకున్నారు. నవంబర్ 11న మహాజన్ తన మొదటి పారాచూట్ జంప్‌ను 5000 అడుగుల నేల స్థాయి (ఏజీఎల్)/17,500 అడుగుల నుండి పూర్తి చేసి నేపాల్‌లోని స్యాంగ్‌బోచే విమానాశ్రయంలో 12,500 అడుగుల వద్ద ల్యాండింగ్ చేసింది. ఈ జంప్‌లో న్యూజిలాండ్‌కు చెందిన లెజెండరీ స్కైడైవర్ వెండి స్మిత్ విమానం లోపల ఆమెకు గైడ్‌గా ఉన్నారు. అంతే పోల్ ఛాలెంజ్‌ను పూర్తి చేసి రెండు జాతీయ రికార్డులను సాధించిన ప్రపంచంలోనే మొదటి మహిళగా నిలిచింది. మరుసటి రోజు మహాజన్ 8,000 అడుగుల నుండి స్యాంగ్‌బోచే విమానాశ్రయంలో భారత జెండాతో దూకింది. అలా చేసిన మొదటి భారతీయ మహిళ ఈమెనే. నవంబర్ 13న 23,000 అడుగుల నుండి అమడబ్లామ్ మౌంటెన్ బేస్ క్యాంప్ వద్ద ఒక జంప్ చేసి 4600/1509 1 అడుగుల వద్ద దిగింది. ఈ జంప్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత స్కైడైవర్ పాల్ హెన్రీ డి బేరే గైడ్‌గా ఉన్నాడు. తర్వాత ఎవరెస్ట్ పర్వతం ముందు 21,500 అడుగుల నుండి తన జీవితంలో అత్యుత్తమ జంప్‌ని ప్రదర్శించింది. కాలా పత్తర్ వద్ద 17,444 అడుగులు / 5,317 మీ ఎత్తులో ల్యాండ్ అయింది. అత్యధిక ఎత్తులో స్కైడైవింగ్ ల్యాండింగ్ చేసిన మహిళగా ఆమె జాతీయ, ప్రపంచ రికార్డులను సాధించింది.
విజయం సాధించాలనే సంకల్పం
‘ఇప్పటివరకు నేను చేసిన జంప్‌లలో ఇది భయంకరమైనది. ఈ ప్రాంతంలో హైపోక్సియా, స్కైడైవింగ్ మరణాల గురించి చాలా కథలు విన్నాను. ఈ సాహసం చేసేటపుడు నాకు తగినంత ఆక్సిజన్ అందని క్షణాన్ని కూడా అనుభవించాను. కానీ అంతా బాగానే ఉంది. పారాచూట్ తెరుచుకుం టుందా లేదా అని కంగారు పడితే అది మనలోని భయాన్ని మరింత పెంచుతుంది’ అంటూ ఆమె జతచేస్తుంది. అయితే భయంతో పాటు ఆమె జయించవలసింది మరొకటి ఉంది. భారతీయ మహిళలు అవకాశం కల్పిస్తే వారు తలపెట్టినది ఏదైనా చేయగలరని నిరూపించాలనే సంకల్పం. శీతల్ లాంటి క్రీడాకారులు రాబోయే తరాలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తారు.
ఒబేర్ చిత్రాన్ని చూసి
శీతల్ స్వస్థలం పూణే. ఆమె తన స్నేహితురాలి సోదరుడితో పాటు, భారత వైమానిక దళ అధికారి కమల్ సింగ్ ఓబెర్‌ను కలవడం ఆమెలో స్కైడైవింగ్ పట్ల ఆసక్తి, ప్రేమను రేకెత్తించాయి. ‘ఆ రోజు తన సోదరుడు స్కైడైవింగ్‌కు వెళ్తున్నాడని ఆమె నాకు చెప్పింది. అదేమిటో అప్పటి వరకు నాకు తెలీదు. ఆమెతో వెళ్ళి దాన్ని చూ శాను. నాకు చాలా బాగా అనిపిం చింది’ అంటూ ఆమె స్కైడైవింగ్‌పై ఆసక్తి కలిగిన రోజులను గుర్తు చేసుకుంది. తర్వాత ఉత్తర, దక్షిణ ధృవాల మీదుగా స్కైడైవ్ చేసిన
మొదటి భారతీయుడైన ఒబెర్ చిత్రాన్ని వార్తాపత్రిక మొదటి పేజీలో చూసింది. ‘అప్పటి నుండి నేను అతన్ని చాలా సార్లు కలుసుకున్నాను. అతను నన్ను కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానించాడు. 2004లో నేను నా మొదటి స్కైడైవ్ ఉత్తర ధ్రువంపై చేసాను. అది కూడా ఎలాంటి శిక్షణ లేకుండా’ అని ఆమె చెప్పింది.
తదుపరి లక్ష్యం
‘2025లో జరిగే ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించాలన్నది నా కల’ అంటున్నారు శీతల్. ఇప్పటి వరకు ఆమె 25 జాతీయ రికార్డులు, రెండు ఆసియా రికార్డులు, ఎనిమిది ప్రపంచ రికార్డులు సాధించారు. అంతే కాదు ఈమె పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. ‘అంత రిక్షంలో స్కైడైవ్ చేసిన మొదటి మహిళ కావాలని నేను కోరుకుంటు న్నాను. వచ్చే రెండేండ్లలో దీన్ని సాధించాలని ఆశిస్తున్నాను. స్కైడైవింగ్‌ను క్రీడగా లేదా సాహసంగా చేయాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగా మీలోని భయాన్ని ఎదుర్కోవాలి. మీ పరిమితులను పరీక్షించుకోవాలి’ అంటుంది శీతల్..
పిల్లలు పుట్టిన తర్వాత
తల్లిదండ్రులు తన ఆలోచనను అంగీకరించ డానికి కొంత సమయం పట్టింది. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత టాటా మోటార్స్‌లో పని చేస్తున్న తండ్రి ఆమె కోసం తన కంపెనీ నుండి కొంత స్పాన్సర్‌షిప్ పొందాడు. మిగిలిన ఖర్చును భరించడానికి అతను అప్పు తీసుకున్నాడు. శీతల్ యుఎస్ నుండి స్కైడైవింగ్ శిక్షణ తీసుకుంది. పెండ్లయి కవలలు పుట్టిన తర్వాత శీతల్‌కు ఇక విశ్రాంతి లభించిందని అందరూ అనుకున్నారు. కానీ అభిరుచి ఆమెను ఆగనీయలేదు. తన పిల్లలకు ఏడాది నిండిన తర్వాత స్కైడైవింగ్ తిరిగి ప్రారంభించింది. ఈసారి తన భర్తను కూడా కలుపుకుంది. అతనితో కలిసి 57 జంప్‌లను పూర్తి చేసింది. ఇలా కలిసి స్కైడైవింగ్ చేసిన మొదటి భారతీయ జంటగా కూడా వీరి నిలిచారు.