25 నుంచి స్లాన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ

– నాలుగు దేశాల నుంచి రానున్న చెస్‌ మాస్టర్లు
హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మరో అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌కు వేదికగా నిలువనుంది. ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ సహా ఫిడె గుర్తింపు, తెలంగాణ చెస్‌ సంఘం సహకారంతో ఆగస్టు 25 నుంచి యూసుఫ్‌గూడ ఇండోర్‌ స్టేడియంలో స్లాన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌ జరుగుతుంది. ఫిడె 1600 రేటింగ్‌కు దిగువన ఉండే మాస్టర్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నారు. బిలో 1600 రేటింగ్‌ టోర్నీ హైదరాబాద్‌లో జరుగనుండటం ఇదే తొలిసారి కానుంది. భారత్‌ సహా కెనడా, యెమన్‌, అమెరికాల నుంచి చెస్‌ మాస్టర్లు ఈ టోర్నీలో ఎత్తులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి చెస్‌ క్రీడాకారులు హైదరాబాద్‌కు రానున్నారు. స్విస్‌ సిస్టమ్‌లో తొమ్మిది రౌండ్ల పాటు జరిగే మూడు రోజుల మెగా ఈవెంట్‌లో విజేతలు రూ.10 లక్షల భారీ నగదు బహుమతి అందుకోనున్నారు. ఓవరాల్‌గా 94 నగదు బహమతులు, 300కి మంది ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్టు స్లాన్‌స్పోర్ట్స్‌ సీఓఓ నవీన్‌ తెలిపారు. ఈ మేరకు అంతర్జాతీయ చెస్‌ టోర్నీ బ్రోచర్‌ను శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ శనివారం ఎల్బీ స్టేడియంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ టెస్‌ టోర్నీలో పోటీపడాలనుకునే (ఫిడె రేటింగ్‌ 1600 పాయింట్లకు దిగువన ఉన్న చెస్‌ మాస్టర్లు) రిజిస్ట్రేషన్‌, ఇతర వివరాల కొరకు 7386377787 నంబర్‌ను సంప్రదించగలరు.