నిద్ర ఏకండీషన్స్‌ అప్లై..!

ప్రశాంతంగా నిద్రపోవాలంటే
దినసరి వ్యాపారాల్ని కట్టిపెట్టి
ఓవరుకోటులా విడిచి హాంగరుకి తగిలించి
మంచంపై కొంత తేలిక పడాలి..!

నీ రంగు రంగుల ఇంధ్ర భవంతిలో
ఎన్ని కాంతుల ధగధగలు ఉన్నా
చిక్కని చీకటితో దోస్తీ చేసి
తల్పంపై నీ తనువు సేద తీరాలి..!

నువ్వెంతటి స్థితిమంతుడవైనా కావచ్చు
నువ్వెంతో ఉన్నత స్థాయిలో ఉండవచ్చు
అయినా వీటన్నింటినీ
మూసే నీ కన్నుల వాకిట వదలాలి..!

మంది-మార్భలం నీ వెంట తిరగవచ్చు
విద్వత్తుతో నీవెంతో కీర్తి పొందవచ్చు
అయినా వీటన్నింటినీ
మరిచి నిద్రను నీవు శరణు కోరాలి..!

బ్రాండెడు పెగ్గుల మందు నిశాతోనో
మోతాదుకు మించి అల్జొలాం టాబ్లెట్లతోనో
మొండి చేసి నిద్రపోవాలంటే మాత్రం
మగతగా తూలిపోయే మత్తే గతి..!

నిద్రకు ఉన్నోడు లేనోడు తేడా లేదు
వయసుతో నిమిత్తం లేదు
కులం మతంతో సంబంధం లేదు
వర్గం, ప్రాంతం అసలేదీ లెక్క కాదు..!

బ్రాండెడు ఎ.సి.ల చల్లదనం
సున్నిత పరుపుల మెత్తదనం ఉన్నా
మెదడు ఆలోచనల సంక్లిష్టతను
వీడకుంటే మాత్రం
శరీరం ఆదమరచి నిద్రపోలేదు..!

పగలంతా శ్రమతో అలసిసొలసి
గడిచిన కాలాన్ని రేపటి కలవరాన్ని కట్టి పెట్టి
చిన్నపిల్లాడిలా నిశ్చింతగా సోలిపోతే
నిదురమ్మ నిను చక్కగా కరుణిస్తుంది..!

అప్పుడే రాత్రి పట్టే ఆ గాఢ నిద్ర
కొన్ని గంటల మరణాన్ని తలపించినా..
ఉదయం లేవగానే ప్రాణం
నీలో కొంగొత్తగా వికసిస్తుంది..!!
– డా. వాసాల వరప్రసాద్‌
9490189847