– అందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి : ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్
నవతెలంగాణ-ఓయూ
భారతీయ సమాజంలో కొన్ని దశాబ్దాలుగా జనగణన లెక్కింపులో కులాలను లెక్కించడంపై విస్తృతం చర్చ జరుగుతోంది.. దానికిగల కారణం కులాలను లెక్కిస్తే సామాజిక న్యాయం అనే భావనను సమర్థవంతంగా అమలు చేయొచ్చునని మెజారిటీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో వామపక్ష, దళిత, బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ”ఏటాక్ ఆన్ వై డు వీనీడ్ ఏ కాస్ట్‌సెన్సెస్” అంశంపై మంగళవారం పొలిటికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్ మాట్లాడుతూ.. భారతదేశంలో సామాజికంగా, రాజకీయంగా ఆర్థికంగా, సాంస్కృతికపరంగా వెనుకబడిన కులాల అభివృద్ధి కోసమే జనగణనలో కులగణన డిమాండ్ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కులగణన చేయాలని కోరారు. దశాబ్దాలుగా వెనుకబడుతున్న కులాల అభ్యున్నతికి కులగణన ఒక సాధనగా ఉంటుందన్నారు. కులాల గణన కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకే పరిమితం కాకుండా అగ్రకులాలను కూడా లెక్కించాలని, అప్పుడే రాజ్యాంగం అందించిన ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారో తెలుస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జనగణలో కులాల గణన జరిగే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొ.చంద్రునాయక్, ప్రొ.చలమల్ల వెంకటేశ్వర్లు, ప్రొ.ప్రభంజన్ యాదవ్, ప్రొ.పరందాములు, ప్రొ.కిరణ్ గౌడ్, ఓయు విద్యార్థి సంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు.