దిలీప్‌ కొణతంకు… సోషల్‌ మీడియా పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ డిజిటల్‌ మీడియా విభాగం డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీఆర్సీఐ) ”సోషల్‌ మీడియా పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌” అవార్డును అందుకున్నారు. న్యూఢిల్లీలో గురు, శుక్రవారాల్లో పీఆర్సీఐ నిర్వహించిన 17వ గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ కాంక్లేవ్‌లో కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అవార్డును అందజేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సామాజిక మాధ్యమాల్లో సేవలందించిన వ్యక్తులకు పీఆర్సీఐ ఈ అవార్డులను ఇస్తున్న సంగతి తెలిసిందే. 2023 సంవత్సరానికిగాను సోషల్‌ మీడియా ఉత్తమ వినియోగం అవార్డు, ఉత్తమ వార్షిక నివేదిక అవార్డు (తెలంగాణ ఐటీ శాఖ వార్షిక నివేదిక 2022-23కి), ప్రజా సేవల ప్రకటనల అవార్డు (”మన ట్యాంక్‌బండ్‌ని శుభ్రంగా, అందంగా ఉంచుకుందాం” వీడియోకి), ఉత్తమ ప్రభుత్వ కమ్యూనికేషన్‌ ఫిల్మ్స్‌ (”కాళేశ్వరం -తెలంగాణ జల విప్లవం” వీడియోకి) అవార్డులొచ్చాయి. తెలంగాణ డిజిటల్‌ మీడియా విభాగం సహాయ సంచాలకులు ముడుంబై మాధవ్‌, డిజిటల్‌ మీడియా కన్సల్టెంట్‌ నరేందర్‌ గుడ్రెడ్డి అవార్డులు అందుకున్నారు.