– కుకీలు మయన్మార్ నుంచి వచ్చినవారిగా చిత్రీకరణ
– అన్నదమ్ముల్లాంటి కుకీ, మైతీల మధ్య చిచ్చు
మణిపూర్‌పై ప్రత్యేకం కథనం
మణిపూర్‌లో సంఫ్‌పరివార్ విద్వేష విత్తును నాటింది. ఇక్కడ, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు గల సంస్థలు ద్వేషపూరిత ప్రచారానికి ఉపయోగించే రెండు అంశాలు కొండ ప్రాంతంలో గసగసాల సాగు, అటవీ నిర్మూలన. ఈ రెండు సమస్యలకు కుకీలే కారణమని కొనన్నాళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్ విస్తృత ప్రచారం జరుపుతున్నది. ఇందుకోసం ఆన్‌లైన్ మీడియాను పెంచి పోషించింది. అన్నదమ్ముల్లాంటి కుకీ, మైతీల మధ్య చిచ్చుకు దీన్నే ఆయుధంగా వాడుకుంటుంది. మణిపూర్ హైకోర్టు మెయితీలకు షెడ్యూల్డ్ తెగ హోదాను ఇవ్వడాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాత, రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లు దాదాపు 84 రోజులుగా రగులుతున్నాయి.
నిజమే, మణిపూర్‌లోని పర్వత ప్రాంతంలో 15,000 ఎకరాలకు పైగా గసగసాలు పండిస్తున్నారు. దీనిని కుకీ రైతులు పండిస్తారు. ఇదే వారి ప్రధాన ఆదాయ వనరు. అయితే డ్రగ్స్ మాఫియాతో గసగసాల సాగుకు ముడిపెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. గసగసాలు తినదగినవి. దీని పూలను మందుల తయారీకి వాడుతున్నారు. డ్రగ్స్ మాఫియా మైతీ వర్గానికి చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారుల చెప్పు చేతుల్లోనే ఉంది. అడవుల వేట విషయంలోనూ ఇదే పరిస్థితి. నరికిన చెట్లను మైతీ అధినేతలు కొనుగోలు చేస్తారు. కుకీలు దీని నుంచి చిన్న మొత్తాన్ని పొందుతారు. అయితే ఈ అడవిని మైతీ వ్యాపారులు స్వాధీనం చేసుకోవాలని కుట్ర పన్నుతున్నారు. మాఫియా గ్రూపులను అణిచివేసేందుకు చర్యలు తీసుకోకుండా సంఫ్‌ు పరివార్, బీజేపీ ప్రభుత్వం కుకీ వ్యతిరేక ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నాయి. మరోవైపు దశాబ్ధాలుగా నివాసముంటున్న కుకీలు మయన్మార్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్లుగా చిత్రీకరిస్తూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
దీంతో ఏర్పడిన విషపూరిత వాతావరణం మణిపూర్‌ను అల్లర్ల భూమిగా మార్చింది. ఇప్పుడు లోయలో కుకీలు, పర్వత ప్రాంతాల్లో మైతీలు నివసించడం అసాధ్యం. ఇంతలో మతపరమైన దాడులు జరిగాయి. కుకీలు ఎక్కువగా క్రైస్తవులు కావడంతో సంఫ్‌ు పరివార్ కుకీ వ్యతిరేక ప్రచారం ముసుగులో క్రైస్తవ వ్యతిరేకతను చాటగలిగింది. లోయలోని మైతీ క్రైస్తవుల 276 చర్చిలను కూల్చివేయడమే ఇందుకు నిదర్శనం. మైతీ చర్చిలు సాధారణంగా తాత్కాలిక నిర్మాణాలు. ప్రతి ప్రాంతంలోని చిన్న వర్గాల అవసరాల కోసం నిర్మించిన ఈ చర్చలు తక్కువ సమయంలోనే కూల్చివేయబడ్డాయి. బాగా కట్టిన ఇరవై ఐదు కుకీ చర్చిలు కూడా ధ్వంసమయ్యాయి.
మణిపూర్‌లో బీజేపీ రహస్యంగా, బహిరంగంగా మద్దతిచ్చే ఉగ్రవాద సంస్థలైన అరంబై తెంగోల్, మైతీ లీపున్‌లతో ఒకవైపు, కుకీ సాయుధ గ్రూపులతో మరోవైపు యుద్ధం లాంటి పోరాటం జరుగుతోంది. మైతీ దుండగులు చెలరేగుతుండగా రాష్ట్ర పోలీసులు నిష్క్రియంగా ఉన్నారు. పోలీసు ఆయుధాల నుంచి 4000కు పైగా తుపాకులు ఎక్కడ మాయమయ్యాయన్న ప్రశ్నకు సమాధానం లేదు. అదే సమయంలో, ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కూడా నలభై కుకీ ఉగ్రవాదులను చంపామని పేర్కొన్నారు. 2017 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాత్రం కుకీ తిరుగుబాటు సంస్థలతో రహస్య చర్చలు జరిపారు.
వంద మందికి పైగా మరణించినట్టు అధికారికంగా ధ్రువీకరించబడినప్పటికీ, వివిధ ఏజెన్సీలు సుమారు 200 మరణాలు సంభవించినట్టు సూచిస్తున్నాయి. వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఐదు వేలకు పైగా ఇండ్లు దగ్ధమయ్యాయి. దాదాపు రెండు వందల గ్రామాలు అగ్నికి ఆహుతయ్యాయి. 60,000 మంది శరణార్థులుగా మారారు. మూడు, నాలుగు అంతస్తుల ఇండ్లు నేలమట్టమయ్యాయి. రాష్ట్రంలోని సీనియర్ నేతలకు కూడా భద్రత లేదు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వోద్యోగుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. మాజీ సైనికుని భార్యాతో సహా మరో ఇద్దరిని నగంగా ఊరేగించారు. మహిళలపై దాడులు, లైంగికదాడులు పెరిగాయి. స్వాతంత్ర సమరయోధుని భార్యను సజీవ దహనం చేశారు. హత్యకు గురైన కుకీల మృతదేహాలు ఇంఫాల్‌కు కూడా చేరుకోలేక మార్చురీలో కుప్పలుగా పోసి ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, మణిపూర్ లోక్‌సభ సభ్యుడు రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో పరిస్థితిపై మాజీ ఆర్మీ స్టాఫ్ విపి మాలిక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జనరల్ నిశికాంత సింగ్ దీనస్థితిని ట్విట్టర్‌లో పంచుకున్నారు. మణిపూర్ పరిస్థితి లెబనాన్ పరిస్థితిని పోలి ఉందని మరియు పాలన లేని భూమిగా మారిందని ట్వీట్ చేశారు. 40 ఏళ్లుగా సైన్యంలో పనిచేసిన ఓ అధికారి ఈ విధంగా స్పందించారు.
మణిపూర్ పరిస్థితి పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రతిబింబిస్తోంది. మణిపూర్‌లో మైనారిటీలపై వేధింపులను అంతం చేసేందుకు మిజోరాంకు చెందిన మైతీలు జోక్యం చేసుకోవాలని మిజోరం విద్యార్థుల ప్రజా వేదిక ఎంఎస్‌డీపీ డిమాండ్ చేసింది. మిజోరాంలో మైయితీలు క్షేమంగా ఉండగా, మణిపూర్‌లో తమ సోదరులు పడుతున్న కష్టాలను చూడనట్లు నటించలేరు. మణిపూర్ సమస్యను సత్వరమే పరిష్కరించకుంటే భవిష్యత్తు దుర్భరంగా మారుతుందని ఎంఎస్‌డీపీ ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొన్న అశాంతి బీజేపీ వాదనలకు విరుద్ధంగా ఉంది. బీజేపీ పాలనలో ఈశాన్య రాష్ట్రాలు శాంతి, ప్రగతిని సాధించాయన్న వాదన సన్నగిల్లుతోంది. సంఫ్‌ు పరివార్ విద్వేష బీజాలను మాత్రమే నాటింది.
కుకీలపై సంఘపరివార్ దుష్ప్రచారం
2:44 am