– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యా, వైద్యం సమాజానికి చాలా ముఖ్యమైందనీ, వాటిపై ప్రభుత్వం ఎంత ఎక్కువ దృష్టి పెడితే..సమాజం అంత మెరుగ్గా అభివృద్ధి అవుతుందని కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకుడు భట్టి విక్రమార్క తెలిపారు.అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా విద్య, ఆరోగ్య రంగాలపై శుక్రవారం జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యమకాలంలో ఈ అంశాలను బాగా నొక్కి చెప్పామని గుర్తు చేశారు. కానీ..రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. 2014 నుంచి విద్యకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తగ్గుతున్నదని చెప్పారు. దీని ఫలితంగానే ఆ రంగంలో రాష్ట్రం చివరి నుంచి ఆరో స్థానంలో ఉందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే తెలంగాణా కంటే తక్కువ ర్యాంకులో ఉన్నాయన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ పథకం పేరుకే ఉందని విమర్శించారు. ఫీజు బకాయిల వల్ల విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేక పోతున్నారని చెప్పారు.వైద్య విద్య ఫీజులు భారీగా పెంచి పేదలకు భారంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్యలో లోపాల వల్ల గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో తగిన సౌకర్యాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. 700 పాఠశాలలకు పైగా సొంత భవనాలు లేవని చెప్పారు. సొంత భవనాలు ఎందుకు కట్టటం లేదని ప్రశ్నించారు. 20వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రం వచ్చినదగ్గర నుంచి ఒక్క సారి కూడా డీఎస్‌సీ వేయలేదని తెలిపారు.విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక యూనివర్సిటీ అయినా పెట్టారా? అని ప్రశ్నించారు. ఐఐటీలు కూడా తేలేదన్నారు. వాటిల్లో ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. ప్రయివేటు యూనివర్సిటీలకు మాత్రం పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పారు. ప్రయివేటు యూనివర్సిటీలకు విచ్చల విడిగా పర్మిషన్లు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వీపర్లతో శ్రమదోపిడి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ పాఠశాలల దోపిడి అంతా ఇంతా కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేందుకు సరిపడా సిబ్బంది లేరని చెప్పారు. దీంతో ప్రయివేటు వైద్యం చేయించుకోలేక, చేయించుకున్నా..తగిన ఫీజులు కట్టలేక ఇల్లు గుల్ల చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియాలో కొత్త భవనం నిర్మిచేందుకు ఖాళీ స్థలం ఉందని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ఐదు ఆస్పత్రులు కడతామని చెప్పిన ప్రభుత్వం ఒక్కటి కూడా కట్టలేదని ఎద్దేవా చేశారు.
భట్టి లేవనెత్తిన అంశాలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. విద్యపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టిందని చెప్పారు. గురుకులాల ఏర్పాటుతో పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. గురుకులాలు సీఎంకు మానస పుత్రికలని చెప్పారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దష్టి పెట్టినట్టు వెల్లడించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, రాగి జావ అందిస్తున్నట్లు తెలిపారు. ‘మనకు పైసలు ముఖ్యం కాదు.. పిల్లల ఆరోగ్యం, భవిష్యత్ ముఖ్యం’ అంటూ సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్ని మంత్రి గుర్తు చేశారు.
బడ్జెట్‌లో విద్యకు నిధుల కేటాయింపు తగ్గుతుందనేది వాస్తవం కాదన్నారు. విద్యా శాఖతో పాటు మిగతా సంక్షేమ శాఖలు కూడా విద్యకు నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు. మద్యాహ్న భోజన పథకానికి తగినన్ని నిధులు కేటాయించటమే కాక, 9, 10 తరగతులకు కూడా భోజనం పెడుతున్నామని చెప్పారు. ఆ పథకంలో వంట కార్మికులకు కూడా రూ. 3వేల గౌరవ వేతనాన్ని ఇస్తున్నామని చెప్పారు. కేజీబీవీల ద్వారా నాణ్యమైన విద్యను అందించటమే గాక 200కు పైగా పాఠశాలలను అప్‌గ్రేడ్ చేశామని తెలిపారు. సంక్షేమ హాస్టళ్ల డైట్ చార్జీలు పెంచామనీ, తద్వారా నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఉన్నత విద్యలోనూ అధ్యాపకుల సమస్య లేకుండా చూస్తున్నామని చెప్పారు.