మట్టి కవిత్వం

Soil poetryపుడమి పలకమీద సేధ్యకాడు అక్షరాల
పంటను పండిస్తున్నడు.
నల్లనిమట్టికి సేద్యకాడికి ఏనాటి సంబంధమో!.
మట్టితో పేగుబంధాన్ని పెనవేసుకున్నడు.
ఆకాశం కళ్ళాపి సల్లుతుంది.
జల్లులు కురుస్తుంటే జలాలు నేలమ్మను
తడుపుతూ పరుగులు తీస్తున్నయి.
ఎండినవనమంతా ఆకుపచ్చని సీర ఆరేసినట్లు.
నల్లని మబ్బులు కమ్ముకొని నింగి… భూమిని ముద్దాడుతున్నది.
కైకిలవ్వలు తమ సేతుల్తో తుకం అలుకుతుంటే
అరికొయ్యలు గాలికి తలూపుతూ ముచ్చట ఇంటున్నయి.
తెల్లని కొంగలు పొలంగట్టుమీద జపం చేస్తున్నయి.
పృథివిపై పచ్చని రామసిలుకలు ఆలినట్లు.
తెల్లబంగారం హాలికుడి కష్టాన్ని తీర్చడానికి నేలలో ఒదిగిపోయింది.
మాగాణి మీద అన్నదాత బువ్వపూలు పూయిస్తున్నడు.
జంగమయ్యలు నేధ్యకాడి చుట్టే తిరుతున్నయి.
తుమ్మెదలు ఎదలో మకరందాన్ని నింపుకొని
రైతన్న గుండెపై వాలుతున్నయి.
విషకౌగిలి కష్టాన్ని తొలగించడానికి.
మట్టిమనిషి పాదాలను కడుగుతూ ప్రవహిస్తుంది సలిలం.
సీకటి రాతిరిలో వెన్నెల వెలిగినట్లు…
కాలుతున్న కడుపుల్లో బుక్కెడు బువ్వయి
కడుపు నింపుతడు సేద్యకాడు.
అక్షర సేద్యాన్ని చేస్తూ మట్టికవిత్వాన్ని అల్లుతున్నడు అన్నదాత.
పచ్చని చెట్లమధ్య బతుకు పాఠాన్ని నేర్చుకుంటూ
ఏమీ ఆశించని ఆశాజీవై బతుకీడుస్తున్నడు.
నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లినప్పుడల్లా నువ్వే గుర్తొస్తవు.
ప్రతి మెతుకులో నీరూపం చెక్కింది ప్రకృతమ్మ
ప్రకృతమ్మకు నువ్వంటే ఎంత ఇష్టమో…
నిన్నే వెంటాడుతూ ఉంటుంది.
అయినా బెదరని అన్నదాతవై
ధాన్యపు సిరులను కురిపిస్తూనే వుంటావు.
నీ ఇంట్లో పసిడి సిరులు కురిసేది ఎప్పుడో.!
– అశోక్‌ గోనె, 9441317361