ఉపాధి హామి కూలీల సమస్యలను పరిష్కరించండి

మంత్రి ఎర్రబెల్లికి డీబీఎఫ్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రామీణ ఉపాధిహామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని దళిత బహుజన ఫ్రంట్‌, తెలంగాణ వ్యవసాయ వృత్తి దారుల యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని మంత్రుల సముదాయంలో రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఉపాధి హామి పరిరక్షణకు కూలీల నుంచి చేపట్టిన లక్ష సంతకాల సేకరణ పత్రాలను మంత్రికి సమర్పించారు. ఈ సందర్భంగా డీపీఎఫ్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌, టీవీవీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం వెంకటయ్య మాట్లాడుతూ పనిదినాలను వంద రోజుల నుంచి 200 రోజులకు, కనీస వేతనాలను రూ.800లకు పెంచాలని కోరారు. వేతనాల అలస్యాన్ని నివారించాలనీ, బడ్జెట్‌ పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి కమిషనర్‌కు సైతం వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు నాగన్న, ప్రభుదాస్‌ ,జమలయ్య, వెంకటమ్మ, స్వాతి, శ్రీనివాస్‌, మునెష్‌ తదితరులు పాల్గొన్నారు.