జర్నలిస్టుల ఇండ్లస్థలాల సమస్యను పరిష్కరించండి

Journalists' homes Solve the problem– మంత్రి మహేందర్‌రెడ్డికి ఫెడరేషన్‌ వినతి
– పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన నేతలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డికి తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఇండ్ల స్థలాల కోసం జర్నలిస్టులు ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నారని గుర్తు చేసింది. శనివారం మంత్రి మహేందర్‌రెడ్డి పుట్టిన రోజు నేపథ్యంలో ఆయనకు ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్‌, రాష్ట్ర కార్యదర్శి ఇ.చంద్రశేఖర్‌, కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, హెచ్‌యూజే నేత పి.నాగవాణి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వడానికి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లోని జర్నలిస్టులకు వెంటనే ఇండ్లస్థలాలు మంజూరు చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని జేఎన్‌జే, జూబ్లీహిల్స్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌, దక్కన్‌ హౌసింగ్‌, తెలంగాణ హౌసింగ్‌ సోసైటీల్లో సభ్యత్వం ఉన్న జర్నలిస్టులతోపాటు లేనివారికి కూడా ఇండ్లస్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోతానని మంత్రి ఫెడరేషన్‌ నాయకులకు హామీ ఇచ్చారు.