అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించండి

Solve the problems of Anganwadis– సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ముఖ్య మంత్రి కే చంద్రశేఖరరావుకు లేఖ రాసారు. రాష్ట్రంలోని అంగన్‌ వాడీలకు స్వయంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా అమలు కావట్లేదనీ, వాటికోసం వారు సమ్మె బాట పట్టారని వివరించారు. సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించి, సమ్మె విరమింపచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని గుర్తుచేశారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలనీ, పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు తక్షణం పరిష్కరించాలని కోరారు. గతనెలలో మంత్రి సత్యవతి రాథోడ్‌ అంగన్‌వాడీ సంఘాలతో చర్చించి, నిర్దిష్ట హామీలు ఇచ్చారనీ, కానీ దానికి భిన్నంగా అతి తక్కువ బెనిఫిట్స్‌ ప్రకటించారని వివరించారు. ప్రధానమైన వేతనాల పెంపు, ఇతర సమస్యలపై అసలు ఏమాత్రం స్పందించలేదన్నారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారనీ, తమిళనాడు, కర్నాటకలో హెల్త్‌కార్డులు ఇచ్చారనీ, పశ్చిమబెంగాల్‌, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌, పండగబోనస్‌ ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి సౌకర్యాలు కల్పించట్లేదనీ, స్వయంగా మంత్రులు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలనీ, పెన్షన్‌, ఇఎస్‌ఐ, ఉద్యోగ భద్రత, గ్రాట్యుటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.10 లక్షలు, హెల్పర్లకు రూ.5 లక్షలు, రిటైర్మెంట్‌ వయసు 60 ఏండ్లు, హెల్పర్లకు ప్రమోషన్లు, 2017 నుంచి టిఏ, డిఏ, ఇంక్రిమెంట్లు, ఇంచార్జి అలవెన్సు బకాయిలు ఇప్పించాలని కోరారు.