ఇండియా కూటమిలోకి మరికొన్ని పార్టీలు..!

Some more parties in India alliance..!– 31, 01 తేదీల్లో ముంబయిలో భేటీ
న్యూఢిల్లీ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా 26 ప్రతిపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి మూడో భేటీ ఈ నెల 31, సెప్టెంబర్‌ 1న (గురు, శుక్రవారం)ముంబాయిలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు కూటమిలో చేరబోతున్నాయంటూ అటు జేడీయూ, ఇటు కాంగ్రెస్‌ బహిరంగంగానే ప్రకటించడంతో ఏయే పార్టీలు ముంబయి భేటీలో పాల్గొనే అవకాశాలున్నాయి, ఎవరెవరితో కూటమి నేతలు సంప్రదింపులు సాగిస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. పంజాబ్‌లోని శిరోమణి అకాలీ దళ్‌ (ఎస్‌ఏడీ) సహా మరో ఎనిమిది ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమితో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. నితీష్‌ కుమార్‌ సారథ్యంలోని జేడీయూతో శిరోమణి అకాలీదళ్‌ (సాద్‌) సంప్రదింపులు సాగిస్తున్నదని చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సైతం పలు రాజకీయ పార్టీలతో చర్చలు సాగిస్తున్నట్టు తెలుస్తున్నది. కొత్త భాగస్వాములను చేర్చుకోవడంపై రాహుల్‌ గాంధీతో ప్రాథమిక చర్చలు జరిగినట్టు సమాచారం.
ముంబయి ఎజెండా..
ఇండియా కూటమి ముంబయి సమావేశంలో పలు అంశాలపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నట్టు చెబుతున్నారు. ఈ సమావేశంలో చిహ్నం (లోగో), రాష్ట్రాల వారీగా ఎన్నికల సర్దుబాట్లు, పొత్తులు, అవగాహనలు సహా పలు వ్యూహాత్మక, కీలక అంశాల మీద అవగాహనకు రానున్నాయి. కూటమికి సమన్వయ కమిటీ నియామకం, కన్వీనర్‌ ఎన్నిక కూడా జరగనుంది. ఆయా పార్టీలకు చెందిన అగ్రనేతలు దేశంలోని వివిధ ప్రధాన ప్రాంతాల్లో సంయుక్తంగా ర్యాలీలు నిర్వహించడంపై కూడా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 11 మంది సభ్యులతో కమిటీగా ఏర్పడి, గాంధీ జయంతి (అక్టోబర్‌ 2) తరువాత దేశవ్యాప్తంగా సంయుక్త ప్రతిపక్ష పార్టీల ర్యాలీలను గణనీయంగా నిర్వహించనున్నారు.
కన్వీనర్‌ ఎవరు?
ముంబాయి సమావేశంలో ‘ఇండియా’ కూటమి కన్వీనర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారన్న అంశంపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కన్వీనర్‌ బాధ్యత జేడీయూ చీఫ్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు అప్పగించే అవకాశాలున్నాయని బలంగా వినిపిస్తుండగా, తాను ఏ పదవి కోరుకోవడం లేదని నితీష్‌ సోమవారం ప్రకటించారు. వేరే నేతకు ఆ బాధ్యత అప్పగించాలని కూడా సూచించారు. ‘ఇండియా’ కూటమి భవిష్యత్‌ వ్యూహంపై చర్చించేందుకే తామంతా ముంబయిలో సమావేశమవుతున్నట్టు చెప్పారు. ముంబాయి సమావేశంలో మరికొన్ని పార్టీలు కూడా చేరే అవకాశం ఉందని ఇప్పటికే నితీష్‌ వెల్లడించారు.
ఆయితే ఆ పార్టీల పేర్లు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. కాగా, లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ 1977లో తీసుకువచ్చిన రివల్యూషన్‌ తరువాతే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని బీహార్‌ బీజేపీ చీఫ్‌ సమ్రాట్‌ చౌదరి చేసిన వ్యాఖ్యలపై నితీష్‌ స్పందిస్తూ, భారతదేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందో ప్రతి ఒక్కరికీ తెలుసునని, స్వాతంత్య్రం వచ్చిన రోజు తెలియకపోవడం చట్టవిరుద్ధమని అన్నారు. బీజేపీ నేతలు ఏమి మాట్లాడారనే విషయాన్ని తాను పట్టించుకోనని అన్నారు.