త్వరలో జిల్లాస్థాయిలో సంయుక్త సమావేశాలు బలమైన నియోజకవర్గాలపై కేంద్రీకరణ

– సంయుక్తంగా జోనల్‌, బూత్‌ కమిటీల ఏర్పాటు
– పోడు భూములు, ప్రజాసమస్యలపై ఉద్యమం: సీపీఐ, సీపీఐ(ఎం) ఉమ్మడి సమావేశం నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లో నిర్వహించిన తరహాలోనే త్వరలో జిల్లా స్థాయిలో సంయుక్త సమావేశాలను నిర్వహించాలని సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలు నిర్ణయించాయి. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో బుధవారం ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌, జాన్‌వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, ఎన్‌ బాలమల్లేశ్‌, కలవేన శంకర్‌ పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, ఉద్యమాలపై వారు సుమారు రెండు గంటల పాటు చర్చించారు. అనంతరం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఏప్రిల్‌ తొమ్మిదో తేదీన నిర్వహించిన సీపీఐ, సీపీఐ(ఎం)ల ఉమ్మడి సమావేశం విజయవంతమైందని తెలిపారు. ఆ ఒరవడిని క్షేత్రస్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లాలని సమావేశం భావించిందని పేర్కొన్నారు. అందులో భాగంగా జిల్లా స్థాయిలో కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు. అసెంబ్లీలో కమ్యూనిస్టు పార్టీల ప్రాతినిధ్యం లేని లోటు స్పష్టంగా కనపడుతున్నదనే అభిప్రాయం పేద ప్రజలు, ప్రగతిశీల, అభ్యుదయ శక్తులు భావిస్తున్నాయని తెలిపారు. అసెంబ్లీలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉండాలంటూ వారు కోరుకుంటున్న విషయం చర్చకు వచ్చిందని పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలోని కమ్యూనిస్టులు బలంగా ఉన్న నియోజకవర్గాలపై కేంద్రీకరించి పనిచేయాలని నిర్ణయించామని వివరించారు. ఆయా నియోజకవర్గాల్లో జోనల్‌, బూత్‌ స్థాయి కమిటీలను సంయుక్తంగా ఏర్పాటు చేయాలని ఉభయ పార్టీల సమావేశం నిర్ణయించిందని తెలిపారు. దాంతోపాటు పోడు భూములు, ఇతర ప్రజా సమస్యలపై ఉమ్మడిగా ఉద్యమాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అవకాశం లేకుండా చేసేందుకు చొరవ చూపి మరింత దృఢంగా పనిచేయాల్సిన అవసరముందని వివరించారు. బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుపైన ఉన్నదని సమావేశం అభిప్రాయపడిందని తెలిపారు.