
ముఖారవిందం కోసం లోషన్‌లు అని, కాస్మోటిక్స్ అని ఎక్కువ ఖర్చు చేస్తుంటారు చాలా మంది. అలా కాకుండా సహజ సిద్ధంగా చర్మానికి కాంతినిచ్చి, హాని చేయని ముల్తానీ ప్యాక్‌లు ట్రై చేస్తే డబ్బు ఆదా చేయవచ్చు. ముఖం కూడా కాంతులీనుతుంటుంది. అవెలాగంటే…
బయట నుంచి వచ్చాక ముల్తానీ మట్టిలో రోజ్‌వాటర్ కలుపుకుని ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే ఎండ ప్రభావం వల్ల చర్మంపై ఏర్పడ్డ టాన్ తొలగిపోతుంది.
మొటిమలూ, వాటి తాలూకు మచ్చలతో ముఖం కాంతిని కోల్పోతే ముల్తానీ మట్టిని చెంచా తులసి పొడి, చెంచా గంధం పొడి వేసి అన్నింటినీ పచ్చిపాలతో మెత్తని పేస్ట్‌లా కలుపుకోవాలి. దీన్ని రోజూ రాత్రిపూట ముఖానికి పూతలా వేసుకుని గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే సమస్య దూరమవుతుంది. చర్మం తాజాగా మారుతుంది.
చర్మం సాగినట్లనిపిస్తే అరకప్పు ముల్తానీ మట్టీ, కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా ఓట్స్, రెండు చెంచాల టమాటా గుజ్జుని కలుపుకుని ఫేస్ ప్యాక్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుని ముఖానికి బాదం నూనె పట్టిస్తే చర్మం నిగనిగలాడుతుంది.
పొడి చర్మం కలవారు ముల్తానీ మట్టిలో చెంచా తేనె, చెంచా బాదం నూనె, అరచెంచా మీగడ, గులాబీ నీరూ కలిపి ముఖానికీ, మెడకీ, చేతులకీ రాసుకోవాలి. పూర్తిగా ఆరకుండానే కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని సహజ నూనె గ్రంథులు బయటికి పోవు. చర్మానికి తగిన తేమ అందుతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది.