పిచ్చుక వలస!?

Sparrow Migration!?ఓ పిచ్చుక ఓ సారి…
పిచ్చిగా ఆలోచించింది!
తరచుగా ఈ జంగిల్‌లో
చల్లని గాలిలో ఎత్తైన చెట్లు
ఆ పచ్చని ఆకులు
తేలికగా ఊగే పూలు
ఎంతో ఆనందాన్నిచ్చినా
కొన్నిసార్లు భీకరంగా
వర్షించే వర్షాలు
పెను తుఫాను గాలికి
ఇరిగి పడిపోయే
వృక్షాలలో తమ గూడులు
చెదిరిపోతున్నాయి
మనసును విరగొడుతున్నాయి!
వీటన్నింటిని తప్పించి
నగరాని కెగిరి పోదామని
ఆలోచించి వలసపోయింది
కాంక్రీట్‌ జంగిల్‌ లోకి!
వారం రోజులల్లోనే
అర్ధమైపోయింది పిచ్చుకకు
ఇక్కడి వీధి వీధుల్లో ఉన్నారు వేటగాళ్లు
ఎన్నో వేషాల్లో బహు రూపాలు!
ఎప్పుడు ఎక్కణుంచి
నక్కుకొంటూ వస్తారో
తనను అపహారిస్తారో
అందమైన తన రెక్కలను
ఎవరు విరుస్తారో
ఎవరు ఏ వల వేస్తారో?
పిచ్చుకకు వచ్చింది బుద్ది
అందుకే నిర్ణయించుకుంది
నాకొద్దీ స్వాతంత్య్రం
విశాలమైన ఈ రంగు రంగుల
నగర ప్రపంచం!
తన మీద నేరుగా పడుతూన్న
సూర్యుడి వెలుతురు కన్న
అడవిలోని ఆకుల మధ్య
ఆకుల అడుగు భాగాల కింద
ఉన్న చీకటియే మిన్న!
ఎగిరిపోయింది పిచ్చుక తక్షణమే
జంగిల్‌ వైపుకు
ప్రాణాలు రెక్కల్లో పెట్టుకొని
ముక్కులో తృణం పట్టుకొని
కట్టుకుంది మరో గూడు
రాబోయే సంతతి కోసం
పొదిగింది గుడ్లు.

– అమ్జద్‌, 00 966 507662638