ఆచితూచి మాట్లాడండి భారత్‌పై అతిగా స్పందించొద్దు

Speak up Don't overreact to India– జీ20 అతిథులకు లోటు రానీయొద్దు: కేంద్రమంత్రివర్గ భేటీలో ప్రధాని మోడీ నిర్దేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
భారత్‌, సనాతన ధర్మంపై ఆచితూచి మాట్లాడాలని కేంద్ర మంత్రు లకు ప్రధాని మోడీ సూచించారు. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్రమంత్రివర్గ సమావేశం అయింది. బేటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌ (బీఈఎస్‌ఎస్‌)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన వాయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) స్కీముకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా 4,000 ఎండబ్ల్యూహెచ్‌లతో కూడిన బీఈఎస్‌ఎస్‌ ప్రాజెక్టులను 2030-31నాటికి అభివృద్ధిచేయడం జరుగు తుంది. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి పథకం-2017 కింద అదనపు నిధులకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.1,164 కోట్ల అదనపు ఆర్థిక వ్యయానికి ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ”భారత్‌” అంశాన్ని ప్రస్తావించారు. భారత్‌ అంశంపై అతిగా స్పందించొద్దని కేంద్ర మంత్రులకు సూచించారు. ఇండియా వర్సెస్‌ భారత్‌ వివాదంపై వ్యాఖ్యలు చేయవద్దని చెప్పారు. కేవలం సంబంధిత వ్యక్తులు మాత్రమే దీనిపై మాట్లాడాలని స్పష్టం చేశారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలకు దీటుగా సమాధానం చెప్పాలని మంత్రులను ఆదేశించారు. చరిత్ర లోతుల్లోకి వెళ్లవద్దని,ఈ అంశంలో ప్రస్తుత, సమకాలిక పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడాలని స్పష్టం చేశారు.
జీ20 సదస్సుకు వచ్చే విదేశీ అతిథులకు రెండు రోజుల పాటు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని సహచర కేంద్రమంత్రులకు సూచించారు. మంత్రులంతా తమ అధికారిక వాహనాలను పక్కన పెట్టాలని తెలిపారు. ఎక్కువ మంది వీఐపీ వాహనాల్లో తిరిగితే ప్రోటోకాల్‌ సమస్యలు రావొచ్చని ఆయన అన్నారు.
అందుకే కేంద్రమంత్రులు భారత్‌ మండపం, ఇతర వేదికల వద్దకు చేరుకోవడానికి షటిల్‌ సర్వీసులను వినియోగించాలని కోరారు. జీ20 ఇండియా మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. విదేశీ ప్రముఖులతో సంభాషించే సమయంలో అందులోని అనువాదం ఉపయోగపడుతుందని అన్నారు.