– మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హజ్‌యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హైదరాబాద్‌లోని హజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజ్‌యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఎయిర్ పోర్టు, రవాణా, పోలీసులు, జీహెచ్‌ఎంసీ, రోడ్లు భవనాల శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం అన్ని వసతులూ సమకూర్చినట్టు తెలిపారు. హజ్‌హౌస్‌లో అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ నుంచి వివిధ శాఖల సహకారంతో ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశామని తెలిపారు. యాత్రికులకు వసతి, బస, విమానాల టికెట్ బుకింగ్, బోర్డింగ్ సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. హజ్‌హౌస్‌లో పాసులు, సామాను స్క్రీనింగ్, సామగ్రి చెక్‌ఇన్, మెడికల్, టీకా వంటి వసతులను అధికారులు ఏర్పాటు చేశారని తెలిపారు. శంషాబాద్ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక టెర్మినల్‌ను యాత్రికుల కోసమే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నారని వివరించారు. డయాస్, సిట్టింగ్ ఏర్పాట్లు, బస్ పాయింట్లలో దిగడం, సామాగ్రి స్క్రీనింగ్, చెక్ ఇన్ కౌంటర్లు, మొదలైనవి హజ్‌హౌస్‌లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దాదాపు 7వేల మంది హైదరాబాద్ నుంచి హజ్‌యాత్రకు వెళ్లనున్నారని తెలిపారు. జూన్ 5 నుంచి నుంచి హజ్ చార్టర్ విమానాలు నడుపుతారని, యాత్రికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ ఈ-బుకింగ్ సిస్టమ్‌తోపాటు, మాన్యువల్ బుకింగ్ సిస్టమ్‌ను సౌకర్యాన్ని కూడా కల్పించినట్టు తెలిపారు.