మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Special attention should be paid to women's health– ప్రభుత్వాలు మద్యాన్ని నిషేధించాలి
– ఐలమ్మ ట్రస్ట్‌ సెక్రెటరీ హైమావతి
– ఐలమ్మ భవన్‌లో హెల్త్‌ క్యాంపును ప్రారంభించిన డీఎంహెచ్‌ఓ
నవతెలంగాణ-ముషీరాబాద్‌
ప్రతి మహిళా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐలమ్మ ట్రస్ట్‌ సెక్రెటరీ హైమావతి అన్నారు. ఐలమ్మ 37వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఐలమ్మ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మెడికల్‌ క్యాంప్‌ను డీఎంహెచ్‌ఓ వెంకట్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ.. ఐలమ్మ ట్రస్ట్‌ ఏర్పడిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా మహిళల్లో ఆరోగ్య సమస్యలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. ఐలమ్మ భవన్‌లో చుట్టుపక్కల పిల్లలకు కరాటే శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు. ముషీరాబాద్‌లో ఎక్కువగా మురికివాడలు ఉండటం, పరిసర ప్రాంతాలు చెత్తాచెదారంతో నిండిపోవడం, మహిళలకు, చిన్నారులకు సరైన అవగాహన లేకపోవడంతో తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. మహిళల్లో హిమోగ్లోబిన్‌ శాతం తక్కువ ఉండటంతో రక్తహీనత, కండరాల నొప్పిలాంటి సమస్యలు వస్తున్నాయన్నారు. హిమోగ్లోబిన్‌ రక్తహీనతను అధిగమించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే మహిళలకు ఐలమ్మ ట్రస్టు ద్వారా బహుమతులు ప్రదానం చేస్తున్నామన్నారు. తద్వారా మహిళలు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారని ఆకాంక్షించారు. నిత్యావసర వస్తువుల ధరలు తీవ్ర స్థాయిలో పెరగడంతో సరైన పోషకాహారం అందడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యాన్ని అనుమతించడంతో యువత తాగుడుకు బానిస లవుతూ విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడు తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్యాన్ని పూర్తిస్థాయిలో నిషేధించి ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందే విధంగా ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ ట్రస్ట్‌ కోశాధికారి ఆశాలత, జ్యోతి, అరుణ జ్యోతి, ఇందిర, కవిత తదితరులు పాల్గొన్నారు.