అధునాతన రైసు మిల్లుల పై ప్రత్యేక కమిటీ

– సీఎం కేసీఆర్‌ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
రాష్ట్రంలో ధాన్యం దిగుబడి నాలుగు కోట్ల టన్నులకు చేరుకునే అవకాశాలున్నాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ విధానంలో భాగంగా ఫుడ్‌ ప్రాసెస్‌ కంపెనీలను స్థాపించేందుకు నిర్ణయించామని తెలిపారు. ఇందులో భాగంగా మిల్లింగ్‌ కెపాసిటీని పెంచేందుకు వీలుగా రాష్ట్రంలోని మిల్లులకు అదనంగా మరిన్ని అధునాతన రైస్‌ మిల్లులను అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాల ఖరారు కోసం ప్రత్యేక కమిటీని సీఎం ప్రకటించారు. ఆ కమిటీకి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షుడిగా, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, టీఎస్‌ఐఐసీ ఎమ్‌డీ నర్సింహారెడ్డి సభ్యులుగా వ్యవహరిస్తారు.
రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు తదితరాంశాలపై శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిల్వ ఉన్న 1.10 కోట్ల టన్నుల ధాన్యాన్ని, నాలుగు లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకోకుండా ఎఫ్‌సీఐ పలు రకాలుగా ఇబ్బందులు పెడుతోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంటే… అదనంగా మరింత ధాన్యం దిగుబడి కానుందని తెలిపారు. ఈ క్రమంలో రైతులు పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి, ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయాలని సూచించారు. తద్వారా రైతులకు మరింత లాభం చేకూరే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న రైస్‌ మిల్లుల సామర్థ్యం కోటి టన్నులు మాత్రమేనని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందువల్ల మరో రెండు కోట్ల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసే దిశగా అధునాతన మిల్లులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ‘సటాకే’ లాంటి కంపెనీలతో చర్చించామని వివరించారు. రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ శనివారం నుంచే ఆయా కంపెనీలతో చర్చించి, ప్రభుత్వానికి అధునాతన నివేదిక అందజేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకరరావు, సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సటాకే ఇండియా డైరెక్టర్‌ ఆర్‌కే బజాజ్‌తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ముంపు పరిస్థితిపై సీఎం ఆరా…
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదలు, భద్రాచలం వద్ద ముంపు పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహిం చిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన… ప్రాణహిత తదితర నదుల ద్వారా కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల్లో చేరుతున్న వరద గురించి అడిగి తెలుసుకున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని సీఎస్‌ శాంతి కుమారి ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. భద్రాచలం వద్ద వరద పరిస్థితిని అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం… సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉందని వివరించారు. శని, ఆదివారాల్లో కూడా భారీ వర్షాలున్న నేప థ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి సూచించారు.