
నవతెలంగాణ వేములవాడ
ఒమన్(మస్కట్) దేశంలోని బర్క సిటీ ఒమన్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వాహకులు నిర్వహించారు. స్వామి వారికి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం తొలిసారిగా మస్కట్‌లో జరగడం ఆనందదాయకం, భక్తుల కోర్కెలు తీర్చే స్వామివారి కృప అందరికీ ఉండాలని, దేశ విదేశాల్లో ఉన్న భక్తులకు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లుగా ఆయన తెలిపారు .నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ, సనాతన ధర్మాన్ని, ఆలయ మహోత్సవాలను ప్రపంచానికి చాటుతున్న ఒమన్ ప్రవాస తెలంగాణవాసుల త్యాగం, భక్తి అభినందనీయం అని కొనియాడారు. తెలంగాణ గల్ఫ్ కార్మికులు తమ వేదనను మరిచిపోయి, రాష్ట్ర సంస్కృతిని విదేశాల్లో పరిరక్షిస్తూ బ్రహ్మోత్సవాలు, కళ్యాణ మహోత్సవాలు, పండుగ వేడుకలు నిర్వహించడం గర్వించదగిన విషయం అన్నారు.తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు తదితరులున్నారు.