డా|| సముద్రాల శ్రీదేవి గారి ‘శ్రీదేవి కథలు-1’ సంగ్రహానికి డా||నాళేశ్వరం శంకరం గారు ముందు మాట రాస్తూ …కాలాతీత కథలు అన్నారు. నిజంగా గతానికెళ్ళినా, వర్తమానం పరికించినా, కుటుంబం, సామాజం ఉన్నంత వరకూ ఈ కథలలో ఉన్న సారం కాలాతీతమని పాఠకులు ఇట్టే పట్టుకునేటట్లున్నాయి. సరళమైన, ఆహ్లాదమైన భాషతో చదువుతున్నంత సేపు పాఠకులు స్వయం అనుభూతిని చూరగొంటారు.
ఇందులో ఉన్న 15కథలు కూడా అలరింప చేసేవే. గాలిలేని తుఫాను మొదటి కథ. ఈ కథానియిక అల కు పెళ్ళి చూపులు అవుతాయి. కాబోయే అల్లుడు సాత్విక్ పేరుకు తగ్గ గుణవంతుడు… పెళ్ళి చూపుల తరువాత ‘ఈ సంబంధం నాకొద్దు నాన్నా!’ అంటుంది అల. ఇదే వారి కుటుంబంలో గాలిలేని తుఫాను భీభత్సం… సృష్టించినట్లై ఆఖరికీ ఏమీ కాలేదన్నట్లు ప్రశాంతంగా అల సాత్విక్‌లు కలిసి పోతారు. ‘గుర్తింపు’ కథలో ఒక పిహెచ్‌డి చేసిన యువకుడు భవన నిర్మాణ కార్మికుడిగా అడ్డాపై నిలబడి ఆ పని చేసిన అనుభవం లేకపోయినా అతితక్కువ కూలీ అయినా పరువాలేదని కష్టపడబోతుంటే కూలీకి పిలిచిన యజమాని అసలు విషయం తెలుసుకుని ఆదుకునే తీరుతో మనిషికి ‘గుర్తింపు’నిస్తుంది. మారని కథ, తడ్రీ కొడుకులు, ఆందోళన లేని సంసారానికి,.. వంటి అనేక కథలు కుటుంబ కథా చిత్రాలే. ఆధునిక భేతాళ కథ మనిషి మితిమీరిన కోరికలతో ఎలా నాశనమవుతాడో చెప్పే సస్పెన్స్ క్రైం. ఎన్నికలే కావాలి కథలో ఒక గ్రామస్తులంతా కలిసి ఎన్నికల ప్రచారానికి వచ్చిన పార్టీలన్నింటితో ఒక కోరిక కోరుకుంటారు. అది ఆరుమాసాలకొకసారి, కనీసం సంవత్సరాలకొకసారి ఎన్నికలు నిర్వహించండి అని. ఎందుకంటే అనేక ఊకదంపుడు వాగ్దానాలు చేస్తారు. ఓట్లు వేసిన తరువాత మరచిపోతారు. ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చరు. ఎందుకంటే ఓటు వేయడానికి డబ్బులిస్తారని. అందుకే మళ్ళీ మళ్ళీ ఓట్లువస్తే కనీసం ఆ డబ్బులైనా కొంత ఉపకరిస్తాయని వారి ఉద్దేశ్యం… ఇలా తగిన శిక్ష, పాపం! సుబ్బారావు, అందమే కాపాడింది. నైతికం ప్రసంగ ఫలం, గెలుపు ఎవరిది?.. ఇవన్నీ సూపర్‌హిట్టు.
ఇలాంటి భవిష్య సమాజాన్ని ఉత్తేజ పరిచే మరెన్నో కథా, సాహిత్య సంపుటాలు శ్రీదేవిగారి కలం నుంచి జాలువారాలని ఆశిద్దాం.
శ్రీదేవి కథలు – 1, డా||సముద్రాల శ్రీదేవి
పేజీలు : 114, వెల: 150/-
ప్రతులకు : సముద్రాల శ్రీదేవి
వైఫాఫ్ సుధీర్ కుమార్, ఫ్లాట్ నెం.102, ఇం.నెం.4-84/1, విజయ నివాస్ అపార్ట్‌మెంట్, దుర్గానగర్. దిల్‌షుక్‌నగర్, రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ 500060. సెల్ :9949837743. ప్రముఖ పుస్తక కేంద్రాలు.
– మహేష్ దుర్గే, 8333987858