మండల పునరావాస కేంద్రాల్లోని సిబ్బందిని

Staff in Mandal Rehabilitation Centres– ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
– రద్దు చేసిన ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలి
– సెర్ప్‌ హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌కు ఎన్పీఆర్డీ వినతి పత్రం అందజేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా మండల మహిళా సమాఖ్య నేతత్వంలో నడుస్తున్న మండల పునరావాస కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బుధవారం సెర్ప్‌ హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ సునీతకు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ), తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నాయకులు వినతి పత్రం అందజేశారు. హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలనీ, రద్దు చేసిన ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని వారు కోరారు.ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్యా, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మీసాల మోహన్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 74 మండలాల పరిధిలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న మండల పునరావాస కేంద్రాలలో పనిచేస్తున్న 221 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. గత 15 సంవత్సరాలుగా 221మంది ఈఐసీఆర్పీ, ఎన్‌హెచ్‌సీ కార్యకర్త, ఎన్‌హెచ్‌సీ ఆయాలుగా మహిళా వికలాంగులు పనిచేస్తున్నారు. వీరిలో 90 శాతం మంది శారీరక వికలాంగులున్నారు. రూ.1000 రూపాయల గౌరవ వేతనంతో పని చేస్తుంటే 2020లో ప్రభుత్వం గౌరవ వేతనాన్ని రూ.5000 పెంచిందని తెలిపారు. ఈ వేతనంతో కుటుంబం గడవగడం ఇబ్బందిగా ఉందనీ, దాన్ని కూడా మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఈ కేంద్రాల్లో పని చేస్తున్న కార్యకర్తలు, ఆయాలు గ్రామీణ ప్రాంతాలలో పునరావాసం అవసరమున్న వికలాంగులను గుర్తించి వారికి ఫిజియోథెరపీ చేయడం, మనసిక పరిస్థితి బాగలేని వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి రోజువారీ పనులు నిర్వహించుకునే విధంగా వారికి అవసరమైన నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారని తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి గ్రామాలకు వెళ్లి టెక్నీషియన్స్‌ ద్వారా చికిత్స చేయించి వైకల్యం కలిగిన పిల్లలను సకలాంగులుగా మార్చి పాఠశాలలో చేర్పించడం జరుగుతుందన్నారు. కేంద్రాల ద్వారా పునరావాసం పొందుతున్న వారికి సర్టిఫికెట్స్‌ ఇప్పించడం, హాస్పిటల్స్‌లో చికిత్స అవసరమున్న వారికి అవసరమైన ఆపరేషన్లు చేపించడంలో కృషి చేస్తున్నారని తెలిపారు. వారికి హెచ్‌ఆర్‌ పాలసీ, గుర్తింపు కార్డులు, ప్రతి నెల వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. . అక్టోబర్‌ 15 లోపు సమస్త పరిష్కారం కాకుంటే సేర్ప్‌ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.
వారం రోజుల్లో సిబ్బంది వివరాలు సేకరించి పరిష్కారం చేస్తాం : …హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ సునీత హామీ
రాష్ట్రవ్యాప్తంగా నైబర్హుడ్‌ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను వారం రోజుల్లో సేకరించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ సునీత హామీ ఇచ్చారు. సిబ్బంది ఎవరు అధైర్యపడద్దని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు డిఆర్డిఓ పిడిలకు ఎన్‌హెచ్‌సీ సెంటర్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కోశాధికారి ఆర్‌.వెంకటేష్‌, ఎన్‌హెచ్‌సీ సెంటర్లలో పనిచేస్తున్న కార్యకర్తలు శైలజ, లక్ష్మి, మంగమ్మ, మశమ్మ, జ్యోతి లక్ష్మి , అంజలి, తిప్పమ్మ ,రోజా, సునిత, పరమేశ్వరి, శిరీష తదితరులు పాల్గొన్నారు