– హెచ్చరించిన ఐక్యరాజ్య సమితి
– స్కూలుపై దాడి : 50మంది మృతి
– సురక్షిత ప్రాంతమంటూ లేకుండాపోయింది : ఐరాస కమిషనర్
– ఆల్‌షిఫా ఆస్పత్రి నుంచి వెళ్లేవారిపై అమానుష సోదాలు
– కాల్పుల విరమణ జరిగితే గాజాను పునర్ నిర్మిస్తాం : టర్కీ
గాజా: ఇంధన కొరత కారణంగా ఏర్పడిన దయనీయమైన, నిస్సహాయ పరిస్థితులతో ఇప్పటికే ఇబ్బందుల పాలవుతున్న గాజా ప్రజలు ఆకలిచావులను ఎదుర్కొనే అవకాశాలు కూడా పొంచి వున్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. శీతాకాలం సమీపిస్తున్నందున పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారతాయని పేర్కొంది. గత ఐదు వారాల కాలంలో గాజాకు కేవలం 10శాతం ఆహారం మాత్రమే వచ్చిందని ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) మధ్య ప్రాచ్య ప్రాంతీయ ప్రతినిధి అబీర్ ఇటెఫా చెప్పారు. దీంతో ప్రజల్లో డీ హైడ్రేషన్, పోషకాహార లోపం బాగా పెరుగుతోందన్నారు. దాదాపు గాజాలో వున్న ప్రతి వ్యక్తీ ఆహార అవసరాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నాడని తెలిపారు. ఆహార ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. మార్కెట్లు కుప్పకూలాయి. జాలర్లు సముద్రంలోకి వెళ్లలేకపోతున్నారు, రైతులు తమ పొలాలవద్దకు వెళ్లలేకపోతున్నారు. దీనికి తోడు శీతాకాలం కూడా సమీపిస్తోంది. ఇప్పుడున్న షెల్టర్లు ఏవీ సురక్షితంగా లేవు, కిక్కిరిసిపోయి వున్నాయి. శుభ్రమైన నీరు లేదు, ఇటువంటి పరిస్థితుల్లో ఆకలి చావులు అనివార్యంగా కనిపిస్తున్నాయని హెచ్చరించారు.
స్కూలుపై దాడిలో 50మంది మృతి
గతకొద్ది రోజులుగా అల్‌షిఫా అస్పత్రిని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు జరిపిన ఇజ్రాయిల్ బలగాలుతాజాగా జాబాలియా శరణార్ధ శిబిరంలో గల స్కూలుపై దాడిచేశాయి. శనివారం ఉదయం అల్-ఫకూరా పాఠశాలపై జరిగిన దాడిలో 50మంది చనిపోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. స్కూలుపై బాంబు దాడిని హమస్ తీవ్రంగా ఖండించింది. అభం శుభం తెలియని చిన్నారులను, అమాయకులను బలితీసుకుంటున్న ఇజ్రాయిల్‌ను ఈ దాడులకు, నేరాలకు జవాబుదారీ చేస్తామని పేర్కొంది. మొత్తంగా ఉత్తర గాజా ప్రాంతంలో పాలస్తీనియన్లు ఎవరూ లేకుండా చేయాలన్నది ఇజ్రాయిల్ ఆలోచనగా వుందని, అందుకే ఇలా స్కూలుపై దాడి చేసిందని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐక్యరాజ్య సమితి నిర్వహించే పాఠశాలపై ఈ దాడి జరిగిందని తెలిపింది. ఈ పాఠశాలలో వేలాదిమంది నిర్వాసితులు తలదాచుకున్నారు. అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకుని, అల్ షిఫా అస్పత్రిలో ఇంక్యుబేటర్లలో వున్న శిశువులను, గాయపడిన చిన్నారులను వెస్ట్ బ్యాంక్ లేదా ఈజిప్ట్‌లోని ఆస్పత్రులకు తరలించి,వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పాలస్తీనా ఆరోగ్యమంత్రి మయి అల్-కైలా కోరారు. అల్ షిఫా ఆస్పత్రిని మిలటరీ బ్యారక్స్‌గా మార్చేస్తున్నారని, తుపాకీలు చూపి బెదిరిస్తూ లోపల వున్నవారిని ఖాళీ చేయిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం గాజాలో ఏ ఆస్పత్రిలో కూడా గాయపడినవారికి చికిత్సనందించే సదుపాయాలు లేవన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో తాను, సిబ్బంది, రోగులతో సహా కొద్దిమంది మాత్రమే వున్నామని, అక్కడ నుండి వెళ్లడానికి ఇజ్రాయిల్ బలగాలు అనుమతించడం లేదని అల్‌షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబూ సాల్మియా తెలిపారు. ఇప్పటివరకు గాజా దాడుల్లో 12వేల మందికి పైగా మరణించారు. జాబాలియా శరణార్ధ శిబిరంపై శుక్రవారం జరిగిన దాడిలో 19మంది చిన్నారులతో సహా ఒకే కుటుంబానికిచెందిన 32మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. కాల్పుల విరమణ జరిగితే గాజాలో ఆస్పత్రులను తాము పునర్నిర్మిస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. ఇజ్రాయిల్ జరిపిన విధ్వంసాన్ని భర్తీ చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తంగా అన్ని సదుపాయాలను పునర్నిర్మాణం చేపడతామన్నారు.
గాజాలో సురక్షితమైన ప్రదేశం అంటూ ఏమీ లేకుండా పోయిందని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి తమారా అల్ రిఫారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక గంట సమయమిచ్చి అల్‌షిఫా ఆస్పత్రి నుండి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశించారని, అలా వెళ్ళేవారినిముఖ్యంగా మహిళలను అమానవీయమైన రీతిలో సోదాచేస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బట్టలూడదీయించి మరీ వారు సోదాలు చేస్తున్నారని, తలెత్తుకోలేని రీతిలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వారు చెప్పారు. ఆస్పత్రి పై అంతస్తులో అనేకమందిని బందీలుగా వుంచి వారికి ఆహారం,నీరు ఇవ్వకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు.