– వారికి జీవో 21 ప్రకారం వేతనాలివ్వాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రయివేటు సెక్యూరిటీ గార్డులు, వాచ్‌మెన్లు, ఇతర సెక్యూరిటీ సర్వీసెస్‌లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయా లనీ, జీవో నెంబర్ 21 ప్రకారం వేతనాలు చెల్లించా లని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశ సరిహద్దుల్లో సైనికులు సైన్యం కాపలా కాస్తుంటే దేశ ఉత్పత్తులు, ప్రజల ఆస్తులు, అనేక ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు సెక్యూరిటీ గార్డులు రక్షణ కల్పిస్తున్నారన్నారు. అటు వంటి సెక్యూరిటీ గార్డుల జీవితాలకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 22 వేలకుపైగా సెక్యూరిటీ సర్వీసెస్ పరిశ్రమలో 22వేలకు పైగా ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీలున్నా యనీ, వాటిలో 90 లక్షల మందికిపైగా ప్రయివేటు సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారని చెప్పారు. వారంతా బడుగు, బలహీన వర్గాల వారేనన్నారు. వారు రోజుకు 12 గంటల షిప్టులో పనిచేస్తున్నారని తెలిపారు. అదనపు పని చేస్తే ఓటీలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి పీఎఫ్, ఈఎస్‌ఐ లాంటి సౌకర్యాలు కూడా అమలు కావడం లేదని తెలిపారు. పస్రా చట్టం ప్రకారం వారికి ఇవ్వాల్సిన ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇవ్వడంలేదన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటల సోమన్న, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.సుధాకర్, నాయకులు అనిల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.