రేపటి నుంచి రాష్ట్ర ఎలైట్‌ చెస్‌ టోర్నీ

State elite chess tournament from tomorrow– ముఖ్య అతిథులుగా సాట్స్‌ చైర్మన్‌, డీజీపీ
హైదరాబాద్‌: రాష్ట్ర చెస్‌ అసోసియేషన్‌, దక్కన్‌ క్లబ్‌ సికింద్రాబాద్‌ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఎలైట్‌ ఇన్విటేషన్‌ చెస్‌ టోర్నీకి తెరలేవనుంది. రెండు రోజుల పాటు దక్కన్‌ క్లబ్‌లో జరిగే చెస్‌ టోర్నీని సాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌, డీజీపీ అంజనికుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. క్లబ్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ ‘వంద ఏండ్లకు పైగా చరిత్ర కల్గిన దక్కన్‌ క్లబ్‌ అనేక క్రీడా ఔత్సాహిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ నెల 9, 10 తేదీల్లో చెస్‌ టోర్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ప్రముఖ ప్లేయర్లు సుమీర్‌ హర్షు, పవన్‌ కార్తీకేయ, ఆదర్శ్‌, సహస్ర, భవిష్క, సరయు, అభిరామి, సంహిత, అంకిత్‌గౌడ్‌ పోటీపడుతున్నారు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ ప్రసాద్‌, క్లబ్‌ కార్యదర్శి శ్యామ్‌, ఉపాధ్యక్షుడు ముకేశ్‌, స్పోర్ట్స్‌ కమిటీ చైర్మన్‌ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.