నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ జవహర్ బాలభవన్ సీనియర్ ఆర్ట్ ఇన్‌స్ట్రక్టర్ కప్పరి కిషన్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఆర్ట్ టీచర్ అవార్డుకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5న హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. 30 ఏండ్లుగా బాలభవన్‌లో అనేక మంది పిల్లలను ఆర్ట్ విభాగంలో తీర్చిదిద్దిన అనుభవం ఆయనది. ఆయన విద్యార్థులు చాలా మంది రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న వారుండటం విశేషం. ప్రతి ఏడాది జనవరిలో, వేసవి సెలవుల శిబిరంలో విద్యార్థుల చేత గ్రీటింగ్ కార్డులు తయారు చేయించి ఎగ్జిబిషన్ పెట్టి ప్రోత్సహిస్తుంటారు. అదే విధంగా బోనాలు, సంక్రాంతి, దసరా తదితర పండుగలకు పోటీలు నిర్వహించి ఆర్ట్‌పై అవగాహన పెంచుతున్నారు. అదే విధంగా బాలభవన్ బయట జరిగే ఆర్ట్ పోటీల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తూ కిషన్ సార్ విద్యార్థులకు ఇష్టమైన సార్ అనిపించుకున్నారు. అవార్డుకు ఎంపికైన సందర్భంగా కిషన్ మాట్లాడతూ, ఈ అవార్డు తనకు మరింత ఉత్సాహాన్నిస్తుందని తెలిపారు.